ఆర్ఆర్ఆర్.. ర‌చ్చ ర‌చ్చే

పోయినేడాది ద‌స‌రాకు ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ఇస్తే.. దానికి బాలీవుడ్లో గొడ‌వ గొడవ అయింది. అదే సీజ‌న్లో త‌న సినిమా మైదాన్‌ను షెడ్యూల్ చేసిన నిర్మాత బోనీ క‌పూర్‌.. రాజ‌మౌళి సినిమాకు పండుగ సీజ‌న్ అవ‌స‌ర‌మా, వేరే డేట్లో రిలీజ్ చేసుకోవ‌చ్చు క‌దా అని అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. ఇక క‌రోనా కార‌ణంగా ఆ డేట్ వ‌దిలేసి ఈ జ‌న‌వ‌రి 7కు ఆర్ఆర్ఆర్ షెడ్యూల్ చేశాక జ‌రిగిన ర‌చ్చంతా తెలిసిందే.

ఇటు తెలుగు చిత్రాలు స‌ర్కారు వారి పాట‌, భీమ్లా నాయ‌క్‌ల‌ను.. అటు హిందీ మూవీ గంగూబాయిని ఖాళీ చేయించాల్సి వ‌చ్చింది. ముఖ్యంగా భీమ్లా నాయ‌క్‌ను వాయిదా వేయించే విష‌యంలో జ‌రిగిన ర‌చ్చ అంతా ఇంతా కాదు.

జ‌న‌వ‌రి 7న కూడా సినిమాను రిలీజ్ చేయలేక వాయిదా వేసిన ఆర్ఆర్ఆర్ టీం.. ఇప్పుడు మ‌ళ్లీ కొత్త డేట్, సారీ డేట్లు ఇచ్చి చాలా ముందుగానే గొడ‌వ మొదలెట్టిన‌ట్ల‌యింది. కుదిరితే మార్చి 18న‌, లేకుంటే ఏప్రిల్ 28న త‌మ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించేసి కూర్చున్నారు ఆర్ఆర్ఆర్ మేక‌ర్స్.

కానీ ఈ ప్ర‌క‌ట‌న విష‌యంలో వివిధ ఇండ‌స్ట్రీల నిర్మాత‌లు ఆగ్ర‌హంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. మార్చి 18న రాధేశ్యామ్‌ను రిలీజ్ చేద్దామ‌నుకుంటే ఇప్పుడా డేట్ మీద ఆర్ఆర్ఆర్ క‌ర్చీఫ్ వేయ‌డం యువి వాళ్ల‌కు న‌చ్చ‌ట్లేదు. మార్చి 18నే ఆర్ఆర్ఆర్ వ‌చ్చేట్ల‌యితే ఏప్రిల్ 1న ఆచార్య‌ను దించ‌డం క‌ష్ట‌మ‌వుతుంది.

ఇక‌ ఏప్రిల్ 28 డేట్‌తోనూ సమస్య లేకుండా లేదు. అదే రోజుకు ‘ఎఫ్-3’ సినిమా షెడ్యూల్ అయి ఉంది. ఇబ్బంది కేవలం తెలుగు సినిమాలతోనే కాదు. కన్నడ మూవీ కేజీఎఫ్-2, తమిళ చిత్రం బీస్ట్ స‌హా వివిధ భాషల్లో రిలీజయ్యే చాలా సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి ఏప్రిల్లో. బాలీవుడ్ వాళ్ల‌కైతే ఆర్ఆర్ఆర్ టీం ప్ర‌క‌ట‌న చిర్రెత్తుకొచ్చేలా చేసిన‌ట్లే క‌నిపిస్తోంది.

మార్చి 18కి అక్ష‌య్ కుమార్ మూవీ బ‌చ్చ‌న్ పాండేను.. ఏప్రిల్ 28కి ర‌న్ వే 34, హీరో పంటి-2 సినిమాలకు రిలీజ్ డేట్లు ఇచ్చారు. ఇప్పుడు ఏదో ఒక డేట్ కాకుండా ఇది కాకుంటే అది అంటూ రెండు డేట్లు ప్ర‌క‌టించ‌డం మ‌రింత గంద‌ర‌గోళానికి దారి తీస్తోంది. మొత్తంగా వివిధ ఇండ‌స్ట్రీల వాళ్ల‌ను అయోమ‌యంలో ప‌డేసేలా ఆర్ఆర్ఆర్ టీం చేసిన ప్ర‌క‌ట‌న ఉంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.