ఏపీలో ‘మద్య నిషేధం’ దిశగా మరో అడుగు

2019 ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రధాన ఎన్నికల హామీల్లో సంపూర్ణ మద్య నిషేధం ఒకటి. ఈ విషయాన్ని మేనిఫెస్టోలో పెట్టడంతో పాటు ఎన్నికల ప్రచారంలో బాగా వాడుకున్నారు జగన్. దీని మీద వైకాపా యాడ్స్ కూడా రూపొందించి టీవీల్లో ప్రచారం చేసింది. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే మద్యం షాపులను తగ్గించి, మద్యం అమ్మకాల టైమింగ్స్ తగ్గిస్తుంటే.. జగన్‌కు నిజంగానే ఈ విషయంలో చిత్తశుద్ధి ఉందనుకున్నారు జనాలు.

కానీ అసలు కథ తర్వాత బోధ పడింది. పేరున్న బ్రాండ్స్ అన్నీ తీసి పడేసి.. అధికార పార్టీ నాయకులు లోకల్‌గా తయారు చేసే బ్రాండ్లతో మద్యం షాపులను నింపేశారు. వాటి ద్వారా వైకాపా నాయకులు దండిగా డబ్బులు సంపాదించారు. మద్యపానం దిశగా మందుబాబులను నిరుత్సాహపరచడానికి అంటూ భారీగా రేట్లు పెంచేసి ఆదాయం పెంచుకున్నారు. వీలైనంత మేర అధికార పార్టీ, ప్రభుత్వం లాభ పడ్డాక.. ఇంకో రెండేళ్లలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో మద్యం పాలసీపై వ్యతిరేకత పెరుగుతుండటంతో ఉన్నట్లుండి రూట్ మార్చేసింది జగన్ సర్కారు.

ఇటీవల మద్యం రేట్లు తగ్గించారు. అలాగే బ్రాండ్లన్నీ అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు ఈ కోవలోనే ఇంకో నిర్ణయం తీసుకున్నారు. ఒకప్పుడు 8 గంటలకే వైన్ షాపులు మూతపడేవి. తర్వాత టైమింగ్ 9కి పెంచారు. ఇప్పుడు పది గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉంచేలా జీవో రిలీజ్ చేశారు.

మద్యం తాగకుండా నిరుత్సాహ పరచడానికే రేట్లు పెంచాం, టైమింగ్స్ తగ్గించాం, బ్రాండ్లు దూరం చేశాం అని చెప్పుకున్న ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ మద్దతుదారులు.. ఇప్పుడు తీసుకుంటున్న చర్యలపై ఏం మాట్లాడతారంటూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు, ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాజా నిర్ణయాన్ని ఎద్దేవా చేస్తూ మద్య నిషేధం దిశగా జగన్ సర్కారు మరో అడుగు అంటూ కౌంటర్లు పడుతున్నాయి నెటిజన్ల నుంచి.