విడిపోయే కాలం: ధనుష్ – ఐశ్వర్య విడాకులు

కాల మహిమ కాకుంటే ఇంకేమనాలి? చూడ ముచ్చట జంట అనుకున్నంతనే.. విడిపోతున్నట్లుగా షాకుల మీద షాకులు ఇస్తున్నారు సినీ జంటలు. బాలీవుడ్ లో ఎక్కువగా కనిపించే ఈ విడాకుల కల్చర్ సౌత్ కు వచ్చేసింది. మొన్నటికిమొన్న క్యూట్ కఫుల్ గా పేరున్న నాగచైతన్య.. సమంతలు పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లుగా చెప్పి అందరిని షాకిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో చూడచక్కని జంట విడిపోయినట్లుగా ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య.. హీరో ధనుష్ దంపతులు విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని సోమవారం రాత్రి.. పొద్దుపోయిన తర్వాత తన అధికార ట్విటర్ ఖాతాలో ట్వీట్ ద్వారా పేర్కొన్నారు ధనుష్. దీనికి సంబంధించిన అధికారిక లేఖను ఆయన ట్వీట్ తో జత చేశారు. తమ పద్దెనిమిదేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికినట్లుగా ధనుష్ వెల్లడించారు. ఓం నమశ్శివాయ.. ప్రేమతో మీ ధనుష్ అంటూ ముగింపు పలికిన సదరు విడాకుల లేఖలో ఏముందంటే..

‘‘మేం పద్దెనిమిదేళ్ల పాటు కలిసి ఉన్నాం. స్నేహితులుగా.. భార్యభర్తలుగా..తల్లిదండ్రులుగా.. శ్రేయోభిలాషులుగా.. ఇలా ఎన్నో రకాలుగా కలిసి జీవించాం. మా దారులు వేరుగా ఉన్నాయి. ఐశ్వర్య.. నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండి. ఈ విషయంలో మాకు అవసరమైన ప్రైవసీని ఇవ్వండి’ అంటూ తాజాగా విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.

2004లో హీరో ధనుష్.. ఐశ్వర్య పెళ్లి చేసుకున్నారు. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉరుము.. మెరుపు లేకుండా బయటకు వచ్చిన ఈ విడాకులు విషయం ఇప్పుడు షాకింగ్ గా మారింది. రజనీకాంత్ కు ఇద్దరు కుమార్తెలు అన్న విషయం తెలిసిందే. ఐదేళ్ల క్రితం రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య సైతం భర్తతో విడాకులు తీసుకోవడం తెలిసిందే.

2010లో చెన్నైకి చెందిన వ్యాపారవేత్త అశ్విన్ రామ్ కుమార్ తో పెళ్లి జరిగింది. నాలుగేళ్లు వీరి వైవాహిక జీవితం బాగానే జరిగినా.. 2015లో వారికి మగబిడ్డ జన్మించారు. ఆ తర్వాత నుంచి వీరి మధ్య విభేదాలు పొడచూపాయి. వీరిద్దరి మధ్య రాజీ కుదర్చటానికి రజనీ దంపతులు ఎంతగా ప్రయత్నించినా ఫలించలేదని చెబుతారు. వీరిద్దరు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించటం.. చివరకు వారికి విడాకులు మంజూరయ్యాయి. చిన్న కుమార్తె సౌందర్యకు పెళ్లైన ఏడేళ్లకు విడాకులు తీసుకుంటే.. పెద్ద కుమార్తె ఐశ్వర్య పద్దెనిమిదేళ్ల దాంపత్య జీవితానికి గుడ్ బై చెప్పేసిన వైనం ఇప్పుడు మింగుడుపడని రీతిగా మారింది.