డబ్ చేస్తే.. రీమేక్ పరిస్థితేంటి?

ఈ మధ్యే తమిళంలో సూపర్ హిట్టయిన సినిమా ‘మానాడు’ రీమేక్ హక్కులను వివిధ భాషలకు కలిపి కొనేశాడు టాలీవుడ్ అగ్ర నిర్మాత సురేష్ బాబు. ఈ చిత్రాన్ని తన చిన్న కొడుకు అభిరామ్ హీరోగా రీమేక్ చేయాలని సురేష్ బాబు అనుకుంటున్నట్లుగా ఇటీవల వార్తలొచ్చాయి కూడా. కానీ ఆల్రెడీ ఈ చిత్రం సోనీ లివ్‌లో తెలుగులో అందుబాటులో ఉంది. తమిళ వెర్షన్‌తో పాటు తెలుగు ఆడియోతోనూ సినిమాను రిలీజ్ చేశారు. ఏదైనా ఓటీటీలో ఒక సినిమా రిలీజైందంటే అదే క్వాలిటీతో కొన్ని పైరసీ వెబ్ సైట్లలో ప్రింట్లు అందుబాటులోకి వచ్చేస్తాయి.

‘మానాడు’ ఒక డిఫరెంట్ మూవీ కావడం, మంచి టాక్ తెచ్చుకోవడంతో తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బాగానే చూస్తున్నట్లున్నారు. ‘ది లూప్’ పేరుతో తెలుగులో విడుదలైన ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో బాగానే చర్చ జరుగుతోంది. మరి డబ్బింగ్ వెర్షన్ ఇంత పాపులర్ అయ్యాక రీమేక్ చేస్తే ఎవరు చూస్తారన్నది ప్రశ్న.ఇలాంటి వ్యవహారమే ఇంకో సినిమా విషయంలో చూడబోతున్నాం.

కాకపోతే ఈసారి ఇబ్బంది పడేది బాలీవుడ్ వాళ్లు. 2019 సంక్రాంతికి విడుదలై నాన్ బాహుబలి హిట్‌గా నిలిచిన ‘అల వైకుంఠపురములో’ చిత్రాన్ని హిందీలో ‘షెహన్ షా’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. హిందీ వెర్షన్లో తెలుగు నిర్మాత అల్లు అరవింద్ కూడా నిర్మాణ భాగస్వామి కావడం విశేషం. దీన్ని కాస్త పెద్ద బడ్జెట్లోనే నిర్మిస్తూ.. ఇంకోవైపు ‘అల వైకుంఠపురములో’ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ హిందీలో బ్లాక్‌బస్టర్ అయిన నేపథ్యంలో బన్నీ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి ‘అల వైకుంఠపురములో’ హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను ఈ నెల 26న నార్త్ మార్కెట్లో రిలీజ్ చేయబోతున్నారట. ఐతే రెండేళ్ల కిందటి చిత్రం.. పైగా తెలుగు వెర్షన్ ఓటీటీలో అందుబాటులో ఉండగా.. హిందీలో రిలీజ్ చేసి ఏం లాభ పడతారు.. దీని వల్ల రీమేక్ జరిగే డ్యామేజ్ ఎంత అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.