కెరీర్‌ని తెలివిగా ప్లాన్ చేసుకోవడం ఎలాగో తమన్నాని చూసి నేర్చుకోవాలి. ఏ హీరోయిన్‌కైనా ఓ టైమ్ వచ్చాక కాస్త డిమాండ్ తగ్గుతుంది. కొన్ని ఫెయిల్యూర్స్ వస్తే వెనుకబడాల్సి వస్తుంది. మళ్లీ ఎలా పుంజుకోవాలి, తనని తాను ఎలా బిజీ చేసుకోవాలి అనేది తెలిసుండాలి. అది తెలుసు కనుకే తమన్నా ఇప్పటికీ జెట్ స్పీడులో దూసుకెళ్తోంది. బాహుబలి సినిమా తర్వాత వరుస పరాజయాలే చవిచూసింది తమన్నా.
చాన్నాళ్లకు ‘ఎఫ్2’తో కాస్త ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత ‘సైరా’ సినిమా వరకు ఫ్లాపులే. ఆ మూవీతో హమ్మయ్య, ఓ హిట్టు దక్కిందనుకుంది. కానీ మళ్లీ ఫెయిల్యూర్స్ మొదలు. అయినా ఇప్పటికీ తను టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగానే ఉంది. అందుకు కారణం కచ్చితంగా తమన్నా తెలివితేటలే. తమన్నా కెరీర్‌ని పరిశీలిస్తే ఓ విషయం అర్థమవుతుంది.
తన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోడానికి వచ్చిన ఏ చాన్స్‌నీ వదులుకోలేదామె. ఓవైపు హీరోయిన్‌గా నటిస్తూనే.. రెడీ, నిన్న నేడు రేపు, నేట్రు ఇండ్రు నాలై, నన్బెందా, సైజ్ జీరోతో పాటు చాలా సినిమాల్లో అతిథి పాత్రలు చేసింది. వెబ్ సిరీసుల ట్రెండ్ మొదలవగానే లెవెన్త్ అవర్, నవంబర్ స్టోరీ లాంటి సిరీసులతో సత్తా చాటింది. ఇక ఆమె చేసినన్ని ఐటమ్ సాంగ్స్ మరే స్టార్ హీరోయిన్ చేయలేదు.
రంగం, అల్లుడు శీను, స్పీడున్నోడు, జాగ్వార్, జై లవకుశ, కేజీఎఫ్, సరిలేరు నీకెవ్వరు తదితర చిత్రాల్లో హీరోలతో కలిసి ఆడి పాడింది. ఇప్పుడు కూడా ‘గని’ మూవీ కోసం ఓ స్పెషల్ సాంగ్ చేసింది. బేసిగ్గా మంచి డ్యాన్సర్ కావడంతో తమన్నా పాటలు ఆ సినిమాకి ప్లస్ అయ్యాయి. అందుకే వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తీస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘గని’లో ఆమెపై పాటను ప్లాన్ చేశారు. సంక్రాంతి సందర్భంగా దాన్ని ఇవాళ రిలీజ్ చేశారు. రింగా రింగా రింగ్ అంటూ బాక్సింగ్ రింగ్‌లోనే తన గ్లామర్‌ని ఒలకబోసింది తమన్నా. తనదైన స్టైల్లో స్టెప్స్ ఇరగదీసింది. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్, హారిక నారాయణన్ సింగింగ్, తమన్నా డ్యాన్స్ కలిసి ఆ పాటను స్పెషల్‌గా మార్చేశాయి.
మొత్తానికి అదీ ఇదీ అని కాకుండా తనను వెతుక్కుంటూ వచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటూ ఎప్పుడూ లైమ్ లైట్‌లోనే ఉంటోంది తమన్నా. ఓవైపు చిరంజీవి లాంటి స్టార్‌తో ‘భోళాశంకర్’లో నటించడం.. మరోవైపు సత్యదేవ్ లాంటి అప్‌కమింగ్ హీరోతో ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా చేయడం తమన్నాకే చెల్లింది. ఇంకొన్నేళ్ల పాటు ఆమె ఇంతే బిజీగా గడపడం ఖాయమనిపిస్తోంది.