డిజాస్టర్ తో సుక్కు హ్యాపీ మూమెంట్

1 నేనొక్కడినే.. సుకుమార్ కెరీర్లో అత్యంత చేదు అనుభవం అంటే ఈ చిత్రమే. ఇప్పుడు ఆ సినిమాను క్లాసిక్ అని, కల్ట్ మూవీ అని ఎంత పొగిడినా..అప్పుడు అది బాక్సాఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్‌గానే నిలిచింది. మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్ సుక్కును నమ్మి అవకాశం ఇస్తే నిలబెట్టుకోలేకపోయాడంటూ సుకుమార్‌ను అందరూ విమర్శించారప్పుడు. తన కెరీర్లో అతి పెద్ద రిగ్రెట్ మహేష్‌కు సరైన విజయాన్నివ్వలేకపోవడమే అంటూ సుకుమార్ అప్పుడప్పుడూ చెబుతుంటాడు.

ఈ బాకీ తీర్చడానికి మహేష్‌తో మరో సినిమా అనుకున్నారు కానీ.. అదెందుకో వర్కవుట్ కాలేదు. ఈ సంగతలా ఉంచిత.. 1 నేనొక్కడినే మూవీ తనకు మరో రకంగా మధురానుభూతిని మిగిల్చిందంటున్నాడు సుక్కు. సంక్రాంతి పండుగతో తనకున్న అనుభవాలు, అనుభూతులను గుర్తు చేసుకుంటూ సుకుమార్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు.

అందులో భాగంగా సంక్రాంతితో ముడిపెడుతూ ‘1 నేనొక్కడినే’ తనకెలా ప్రత్యేకమో వివరించారు సుక్కు.‘‘సంక్రాంతి నాకు చాలా ఇష్టమైన పండుగ. చిన్నతనంలో ఎన్నో గొప్ప అనుభవాలున్నాయి ఆ పండుగతో. కానీ ఇండస్ట్రీలోకి వచ్చాక నాకు సంక్రాంతిని ఎంజాయ్ చేసే సమయమే దొరకలేదు. సాధారణంగా నా సినిమాలు వేసవిలో రిలీజవుతుంటాయి. అప్పుడు సినిమా రెడీ చేయాలంటే జనవరిలో ఊపిరి సలపనంత పని ఉంటుంది. పండుగ రోజుల్లో షూటింగ్ లేకపోయినా..ఏదో టెన్షన్ మైండ్ నిండా ఉంటుంది.

సినిమాకు సంబంధించిన విషయాలే నన్ను వెంటాడుతుంటాయి. అవి నన్ను కుదురుగా ఉండనివ్వవు. అందుకే దర్శకుడిని అయ్యాక సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేయడం అరుదు. కానీ 2012లో మాత్రం ‘1 నేనొక్కడినే’ కథ మొత్తం పూర్తి చేసి సినిమా ఓకే చేయించుకున్నా. షూటింగ్‌కు ఇంకా చాలా టైం ఉంది. మెదడులో ఎలాంటి టాస్కుల్లేవు. హాయిగా ప్రశాంతంగా ఉన్నా. ఊరికెళ్లి సంక్రాంతిని బాగా ఎంజాయ్ చేశా’’ అని సుకుమార్ గుర్తు చేసుకున్నాడు.