ఘాజీ దర్శకుడు ఏం చేస్తున్నాడంటే..?

ఘాజీ’ లాంటి సెన్సేషనల్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు సంకల్ప్  రెడ్డి. ఈ చిత్రం కేవలం తెలుగు వాళ్లనే కాదు.. తమిళ, హిందీ ప్రేక్షకుల్ని కూడా మెస్మరైజ్ చేసింది. విమర్శకుల ప్రశంసలందుకుంది. జాతీయ అవార్డు కూడా సాధించింది. ఐతే ఈ సినిమా విషయంలో సంకల్ప్‌కు రావాల్సినంత క్రెడిట్ రాలేదన్న అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది. తొలి ప్రయత్నంలోనే ఇంత మంచి సినిమా తీసిన దర్శకుడి పేరు మార్మోగిపోయి ఉండాలి.

కానీ సంకల్ప్‌ మీడియాలో కూడా అంతగా హైలైట్ కాలేదు. దీనికి తోడు అతడి రెండో చిత్రం అంతరిక్షం అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో అతడిపై వన్ ఫిలిం వండర్ అనే ముద్ర పడిపోయే ప్రమాదం తలెత్తింది. అంతరిక్షం విడుదలై  మూడేళ్లు దాటినా ఇప్పటిదాకా సంకల్ప్ తర్వాతి చిత్రం మొదలే కాలేదు.

మధ్యలో నెట్ ఫ్లిక్స్ వారి ‘పిట్టకథలు’ ఒక సెగ్మెంట్ డైరెక్ట్ చేశాడు సంకల్ప్. దానికి ఏమంత అప్లాజ్ రాలేదు. తర్వాత బాలీవుడ్లో ఏదో సినిమా చేయబోతున్నట్లు వార్తలొచ్చాయి కానీ.. అది ఒక పట్టాన తెమలలేదు. దీంతో సంకల్ప్ గురించి అంతా మరిచిపోయారు. ఇక ఈ దర్శకుడి కథ ముగిసినట్లే అనుకుంటుండగా.. ఒక క్రేజీ ప్రాజెక్టుతో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు సంకల్ప్. బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ హీరోగా ‘ఐబీ 91’ అనే హిందీ సినిమాను మొదలుపెట్టాడు సంకల్ప్ రెడ్డి.

ఇది విద్యుత్ సొంత నిర్మాణ సంస్థ యాక్షన్ హీరో ఫిలిమ్స్ బేనర్లో తెరకెక్కనుండటం విశేషం. ఇందులో విద్యుత్ ఇంటెలిజెన్స్ అధికారిగా కనిపించనున్నాడు. తమ ఐడెంటిటీ జనాలకు తెలియకుండా తెర వెనుక ఎన్నో సాహసాలు చేసి, దేశానికి గర్వకారణంగా నిలిచే ఐబీ అధికారుల జీవితాలను ఈ సినిమాలో చూపించబోతున్నాడట సంకల్ప్. మరి ఈ చిత్రంతో సంకల్ప్ బలంగా బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.