గల్లా అశోక్.. తెలుగు తెరపై తళుక్కుమనబోతున్న కొత్త వారసుడు. సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇతను మేనల్లుడన్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్, ఆయన భార్య అయిన మహేష్ సోదరి పద్మావతిల తనయుడే అశోక్. మహేష్‌కు బావ అయిన సుధీర్ బాబు ఆరంభంలో విమర్శలు ఎదుర్కొని, ఆ తర్వాత కష్టపడి తనేంటో రుజువు చేసుకోగా.. ఇప్పుడు అశోక్ ఎలా నిలదొక్కుకుంటాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అశోక్ తొలి చిత్రం హీరోను ఆమె తల్లే స్వయంగా నిర్మించారు. భలే మంచి రోజు, శమంతకమణి, దేవదాస్ చిత్రాల దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. ఐతే అశోక్ తెరంగేట్రం ఇంతకంటే గ్రాండ్‌గా ఉండాల్సింది. అగ్ర నిర్మాత దిల్ రాజు.. అశోక్‌ను లాంచ్ చేయడానికి ముందుకు వచ్చారు కొన్నేళ్ల కిందట. దీని గురించి ఘనంగా ప్రకటన చేశారు. కానీ తర్వాత ఏమైందో ఏమో ఆ సినిమా పత్తా లేకుండా పోయింది.
హీరో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో దిల్ రాజు సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో అశోక్‌ను అడగ్గా.. తాను ఆ కథకు సరిపోననే ఆ సినిమాను ఆపేసినట్లు తెలిపాడు. ఆ సినిమాలోని పాత్రకు కాస్త ఎక్కువ వయసు ఉండాలని, తాను అప్పటికింకా చిన్న కుర్రాడిలాగే ఉండటంతో ఆ కథను న్యాయం చేయలేనన్న ఫీలింగ్ కలిగిందని.. ఈ విషయంలో అందరిలోనూ ఒకే అభిప్రాయం ఉండటంతో సినిమాను ఆపేయాల్సి వచ్చిందని అశోక్ తెలిపాడు.
రాఘవేంద్రరావు తనను లాంచ్ చేయాలనుకున్నట్లు వచ్చిన వార్తలు నిజం కాదని అశోక్ స్పష్టం చేశాడు. హీరో సినిమా విషయానికి వస్తే అది తనకు పర్ఫెక్ట్గా సూటయ్యే సినిమా అని.. ఈ పాత్రలో చాలా వేరియేషన్లున్నాయని, తొలి సినిమాలోనే అనేక రసాలు పండించే అవకాశం తనకు దక్కిందని అశోక్ తెలిపాడు. హీరో మూవీలో సినిమా హీరో కావాలనుకునే మిడిల్ క్లాస్ అబ్బాయి పాత్ర తనదని.. చాలా దూకుడుగా ఉండే ఆ కుర్రాడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనే కథతో సినిమా తెరకెక్కిందని అశోక్ వెల్లడించాడు.