మినిమం బ‌జ్ లేదు.. ప‌ట్టించుకుంటారా?

2022 జ‌న‌వ‌రి 7… దేశ‌వ్యాప్తంగానే కాక‌, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇండియ‌న్ సినిమాను ఇష్ట‌ప‌డే వాళ్లంద‌రూ ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూసిన రోజిది. ఈ రోజు రానే వ‌చ్చింది. కానీ ఎవ్వ‌రిలోనూ ఉత్సాహం లేదు. ఈ తేదీని విడుద‌ల కావాల్సిన భారీ చిత్రం ఆర్ఆర్ఆర్ వాయిదా ప‌డిపోవ‌డ‌మే అందుక్కార‌ణం. ప‌ది రోజుల ముందు వ‌ర‌కు కూడా జన‌వ‌రి 7న రిలీజ్ ప‌క్కా అంటూ వ‌చ్చిన చిత్ర బృందం.. ఆ త‌ర్వాత వెన‌క్కి త‌గ్గ‌క త‌ప్ప‌లేదు.

దేశంలో క‌రోనా కేసుల ఉద్ధృతి పెరిగిపోతుండ‌టం, థియేట‌ర్లు మూత‌ప‌డుతుండ‌టంతో వాయిదా అనివార్యం అయింది. ఆర్ఆర్ఆర్ ఖాళీ చేసిన ఈ తేదీని వాడుకోవ‌డానికి రెండు తెలుగు చిత్రాలు హ‌డావుడిగా ముందుకు వ‌చ్చాయి. అందులో ఒక‌టి రానా ద‌గ్గుబాటి న‌టించిన 1945 కాగా.. ఇంకోటి ఆది సాయికుమార్ లీడ్ రోల్ చేసిన అతిథి దేవోభ‌వ‌.
ఐతే ముందు నుంచే ఈ రెండు చిత్రాల‌పై బ‌జ్ లేక‌పోగా.. హ‌డావుడిగా, పెద్ద‌గా ప్ర‌మోష‌న్లు లేకుండా సినిమాల‌ను రిలీజ్ చేస్తుండ‌టంతో ప్రేక్ష‌కుల ఆస‌క్తి అంతంత‌మాత్రంగానే క‌నిపిస్తోంది.

అస‌లీ వారం రెండు కొత్త సినిమాలు రిలీజ‌వుతున్న ఫీలింగే జ‌నాల‌కు లేదు. రానా అయిదారేళ్ల‌ కింద‌ట న‌టించిన సినిమా 1945. సీనియ‌ర్ నిర్మాత సి.క‌ళ్యాణ్ ప్రొడ‌క్ష‌న్లో త‌మిళ ద‌ర్శ‌కుడు స‌త్య‌శివ ఈ చిత్రాన్ని రూపొందించాడు. రెజీనా హీరోయిన్. రానా స‌హా ఎవ్వ‌రూ ఈ సినిమాను ప‌ట్టించుకున్న‌ట్లుగా క‌నిపించ‌డం లేదు. అస‌లొక ప్రెస్ మీట్ కూడా లేదు.

కాక‌పోతే థియేట‌ర్ల‌లో ఆడించ‌డానికి పెద్ద‌గా సినిమాలు లేక‌పోవ‌డంతో దీనికి థియేట‌ర్లు బాగానే దొరికాయి. ఇక ఎన్నో ఏళ్ల నుంచి ఫ్లాపుల ప‌రంప‌ర‌లో కొట్టుమిట్టాడుతున్న ఆది.. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త సినిమాల‌ను దించుతూనే ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే అతిథి దేవోభ‌వ ప్రేక్ష‌కుల ముందుకొస్తోంది. పొలిమేర నాగేశ్వ‌ర్ అనే ద‌ర్శ‌కుడు రూపొందించిన చిత్ర‌మిది. దీని ట్రైల‌ర్ ప‌ర్వాలేద‌నిపించింది. మ‌రి బ‌జ్ లేకుండా వ‌స్తున్న ఈ కొత్త చిత్రాల‌ను ప్రేక్ష‌కులు ఏమేర ఆద‌రిస్తారో చూడాలి.