రియ‌ల్ సంక్రాంతి సినిమాలేవి?

ఆర్ఆర్ఆర్ మూవీ వాయిదా అని ఇలా అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చిందో లేదో.. కొన్ని గంట‌ల నుంచే సంక్రాంతి రిలీజ్ అంటూ ఒక్కో సినిమా పోస్ట‌ర్ వ‌ద‌ల‌డం మొద‌లుపెట్టారు. 24 గంట‌ల్లో ఇలా అర‌డ‌జ‌నుకు పైగా సినిమాల‌కు ప్ర‌క‌ట‌నలు రావ‌డం విశేషం. మొన్న‌టిదాకా చ‌ప్పుడు లేని సినిమాల‌న్నీ వ‌రుస‌బెట్టి ఇలా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ల‌తో రావ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

వీటిలో చాలా సినిమాలు అస్స‌లు వార్త‌ల్లో లేనివే. వాటి షూటింగ్, ఇత‌ర అప్‌డేట్లేవీ ఈ మ‌ధ్య కాలంలో రాలేదు. ఒక్క ఆర్ఆర్ఆర్ వాయిదా ప‌డితే ఇన్ని కొత్త సినిమాలు సంక్రాంతి రేసులోకి రావ‌డ‌మేంటో జ‌నాల‌కు అంతుబ‌ట్ట‌డం లేదు. దీనిపై పెద్ద ఎత్తున మీమ్స్ కూడా త‌యార‌వుతున్నాయి. ఎవ‌ర్రా మీరంతా అంటూ కౌంట‌ర్లు వేయ‌డం, ఎక్స్‌పెక్టేష‌న్ వెర్స‌స్ రియాలిటీ థీమ్‌తో పోస్టులు పెట్ట‌డం చేస్తున్నారు నెటిజ‌న్లు.

ఐతే ఇలా రేసులోకి వ‌చ్చిన చిత్రాలన్నీ సంక్రాంతికి బ‌రిలో ఉంటాయ‌న్న గ్యారెంటీ అయితే క‌నిపించ‌డం లేదు.
ఎంత సంక్రాంతి అయినా మూడునాలుగు సినిమాలు వ‌స్తే ఎక్కువ‌. కానీ ఇప్పుడేమో ఆల్రెడీ బంగార్రాజు ప‌క్కాగా రాబోతుండ‌గా, రాధేశ్యామ్ ఇంకా రేసులోనే ఉండ‌గా.. కొత్త‌గా సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ మూవీ డీజే టిల్లు, గ‌ల్లా అశోక్ హీరోగా ప‌రిచయం అవుతున్న హీరో, చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ న‌టించిన  సూప‌ర్ మ‌చ్చి, దిల్ రాజు సోద‌రుడి కొడుకు ఆశిష్ న‌టించిన‌ రౌడీ బాయ్స్‌, రాజశేఖ‌ర్ మూవీ శేఖ‌ర్, ఎం.ఎస్‌.రాజు సినిమా 7 డేస్ 6 నైట్స్.

ఇలా సంక్రాంతికి డేట్ ప్ర‌క‌టించిన సినిమాల జాబితా చాలా పెద్ద‌దే. ఎవ‌రికి వాళ్లు ఎందుకైనా మంచిది కర్చీఫ్ వేసి చూద్దాం, ఛాన్సుంటే రిలీజ్ చేద్దామ‌ని హడావుడిగా ప్ర‌క‌ట‌న అయితే ఇచ్చేసిన‌ట్లుగా క‌నిపిస్తోంది. రాబోయే రోజుల్లో ప‌క్కాగా ఏ సినిమాలు వ‌స్తాయో చూసుకుని, థియేట‌ర్లు ఎంత మేర ద‌క్కుతాయో ప‌రిశీలించి ఆ త‌ర్వాత కొన్ని సినిమాలు రేసు నుంచి త‌ప్పుకోవ‌చ్చు. ప్ర‌స్తుతానికైతే బంగార్రాజు మాత్ర‌మే ప‌క్కా సంక్రాంతి సినిమా అని ఫిక్స్ అవ్వొచ్చు.