థియేటర్లలోకి దిగే చిన్న సినిమాల పరిస్థితి మరీ దయనీయంగా మారుతోంది రోజు రోజుకూ. కరోనా మహమ్మారి పుణ్యమా అని జనాలు మామూలుగానే థియేటర్లకు రావడం తగ్గించేశారు. ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు. పెద్ద సినిమాలంటే ఉండే క్రేజ్ వేరు కాబట్టి వాటికి మంచి టాక్ వస్తే వసూళ్లు బాగుంటున్నాయి. యావరేజ్ టాక్‌తోనూ అవి ఓ మోస్తరుగా నడుస్తాయి.
కానీ చిన్న సినిమాల పరిస్థితి అలా కాదు. టాక్ బాగున్నా సరే.. థియేటర్లకు జనాలను రప్పించడం కష్టమవుతోంది. అందులోనూ తెలంగాణలో టికెట్ల రేట్లు పెంచేయడం చిన్న సినిమాల ఆక్యుపెన్సీ మీద మరింత ప్రభావం చూపిస్తున్నట్లే కనిపిస్తోంది. 2021 చివరి సినిమాగా శుక్రవారం నాడు శ్రీ విష్ణు సినిమా అర్జున ఫల్గుణ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మామూలుగానే ఈ సినిమాకు అంతగా బజ్ లేదు. దీనికి తోడు పూర్తి నెగెటివ్ టాక్ రావడంతో సినిమా వాషౌట్ అయిపోయింది.
పుష్ప, శ్యామ్ సింగరాయ్ చిత్రాలు బాగా ఆడుతున్న టైంలో వచ్చి, డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో అర్జున ఫల్గుణ బాక్సాఫీస్ దగ్గర వాషౌట్ అయిపోయింది. రిలీజ్ చేసిందే తక్కువ థియేటర్లలో. పైగా టాక్ బాగా లేదు. అందులోనూ తెలంగాణలో టికెట్ల రేట్లు పెరిగిపోయాయి. ఇక థియేటరుకొచ్చి ఈ సినిమాను చూసేదెవరు? థియేటర్ల మెయింటైనెన్స్ డబ్బులు కూడా రాక షోలు తగ్గించేశారు. వీకెండ్ అయ్యేసరికే సినిమా అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి తలెత్తింది.
కథల ఎంపికలో మంచి అభిరుచి ఉన్నవాడిగా పేరున్న శ్రీవిష్ణు, ఇప్పటిదాకా మంచి మంచి సినిమాలు నిర్మించిన మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత నిరంజన్ రెడ్డిలకు అర్జున ఫల్గుణ చాలా చెడ్డ పేరు తెచ్చింది. శ్రీ విష్ణు కెరీర్లో హిట్లున్నా సరే.. అతడికి స్టార్ ఇమేజ్ లేకపోవడం, మాస్ ఫాలోయింగ్ లేకపోవడంతో నెగెటివ్ టాక్ తెచ్చుకున్న అతడి సినిమాలు అస్సలు నిలబడట్లేదు. ఇంతకుముందు తిప్పరా మీసం లాగే అర్జున ఫల్గుణ కూడా వాషౌట్ అయిపోయింది బాక్సాఫీస్ దగ్గర.