తెర మీదే కాదు.. బయట ఎక్కడైనా వేదికలెక్కి మాట్లాడేటపుడు కూడా సీనియర్ నటుడు రాజేంద్ర అందరినీ భలేగా ఎంటర్టైన్ చేస్తుంటారు. ఆయన ప్రసంగాలు చాలా ఆసక్తికరంగా సాగుతాయి. నాలుగున్నర దశాబ్దాలుగా నటుడిగా అనేక గొప్ప పాత్రలతో అలరిస్తూ వస్తున్న ఆయన.. ఇప్పుడు ‘సేనాపతి’ అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. అల్లు వారి ఆహా ఓటీటీ కోసం చిరంజీవి తనయురాలు సుస్మిత నిర్మాణంలో యువ దర్శకుడు పవన్ సాధినేని రూపొందించిన చిత్రమిది.
ఆసక్తికర ప్రోమోలతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. ఈ గురువారమే దీనికి ప్రిమియర్స్ పడబోతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రి రిలీజ్ ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ తనదైన శైలిలో పంచులు విసురుతూ మాట్లాడటం.. ఆ పంచ్‌లు ఆహా అధినేత అల్లు అరవింద్‌ను టార్గెట్ చేస్తూ సాగడం విశేషం. అల్లు రామలింగయ్యకు అరవింద్ కంటే కూడా తాను అంటేనే చాలా ఇష్టమని.. పక్కన్న అరవింద్‌ను పెట్టుకుని స్టేట్మెంట్ ఇచ్చారు రాజేంద్ర ప్రసాద్.
అంతే కాక.. నిజమా కాదా అని అరవింద్‌నే అడిగారు. దీనికి అరవింద్ బదులిస్తూ.. ‘‘నిజమే. నన్ను కొడుకు అనేవారు. ఈయన్ని దొంగ నా కొడుకు అనేవారు’’ అనడంతో అందరూ గట్టిగా నవ్వేశారు. ఇండస్ట్రీలో తనకు సినిమాల పరంగానే కాక వ్యక్తిగతంగా కూడా అత్యంత ఆప్త మిత్రుడు చిరంజీవే అన్న విషయం అరవింద్‌కు బాగా తెలుసని.. చిరంజీవి కూతురంటే తనకూ సుస్మిత కూతురు అని.. ఆమె నిర్మాణంలో నటించడం తనకు చాలా ఆనందంగా ఉందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
అరవింద్‌తో తనకు నాలుగు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉన్నా సరే.. ఇప్పటిదాకా తనను లీడ్ రోల్‌లో పెట్టి ఒక్క సినిమా కూడా తీయలేదని.. కానీ ఇప్పుడు తన కూతురు సుస్మిత వచ్చి తనతో ‘సేనాపతి’ తీసిందని అరవింద్‌పై మరో పంచ్ వేశారు రాజేంద్ర ప్రసాద్. సుస్మిత లాంటి యువ నిర్మాతలు తక్కువ డబ్బులు పెట్టి పెద్ద సినిమాలు తీస్తున్నారని.. అరవింద్ లాగా భారీ చిత్రాల జోలికి పోకుండా ఆమె ఇదే ఒరవడిని కొనసాగించాలని కూడా రాజేంద్ర ప్రసాద్ సరదాగా మరో చురక అంటించారు అల్లు వారికి.
Gulte Telugu Telugu Political and Movie News Updates