బోయ‌పాటి కాంబోనా మ‌జాకా!

న‌ర‌సింహ‌నాయుడు సినిమా త‌ర్వాత‌ నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్లో హైస్ అని చెప్పుకోవాలంటే బోయ‌పాటి శ్రీనుతో చేసిన సింహా, లెజెండ్ మాత్ర‌మే. మిగ‌తా సినిమాల్లో మెజారిటీ డిజాస్ట‌ర్లే. ఒక‌టీ అరా ఓ మోస్త‌రుగా ఆడాయంతే. అస‌లు వ‌రుస డిజాస్ట‌ర్ల‌తో బాల‌య్య‌ కెరీర్ దారుణంగా దెబ్బ తిన్న స‌మ‌యంలో సింహాతో మ‌ళ్లీ నంద‌మూరి హీరోను బోయ‌పాటి ఎలా పైకి లేపాడో తెలిసిందే. లెజెండ్‌తో మ‌రోసారి బాల‌య్య‌కు లైఫ్ ఇచ్చాడు. ఇప్పుడీ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌స్తున్న మూడో సినిమాపై అంచ‌నాలు బాగానే ఉన్నాయి. ఐతే ఆ అంచ‌నాల్ని మ‌రో స్థాయికి తీసుకెళ్లింది మంగ‌ళ‌వారం సాయంత్రం రిలీజ్ చేసిన ఫ‌స్ట్ రోర్ టీజ‌ర్. గ‌త ఏడాది రూల‌ర్ సినిమా స‌మ‌యానికి బాల‌య్య మార్కెట్ ఎంత‌గా దెబ్బ తిందో, ఆయ‌న క్రేజ్ ఎలా ప‌డిపోయిందో తెలిసిందే. బాల‌య్య ఇక సినిమాలు మానుకుంటే మంచిద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

ఐతే బోయ‌పాటితో మ‌ళ్లీ బాల‌య్య సినిమా అనేస‌రికి అభిమానుల్లో ఆశ‌లు చిగురించాయి. ఈ రోజు టీజ‌ర్ చూశాక అభిమానులే కాదు.. సామాన్య ప్రేక్ష‌కుల్లోనూ సినిమాపై క్రేజ్ వ‌చ్చేసింద‌న్న‌ది స్ప‌ష్టం. కాంబినేష‌న్ క్రేజ్‌కు త‌గ్గ‌ట్లే టీజ‌ర్ త‌యారైంది. ఈ టీజ‌ర్ రావ‌డం ఆల‌స్యం.. సోష‌ల్ మీడియా షేకైపోయింది. ట్విట్ట‌ర్లో ఒక్క‌సారిగా టాప్ ట్రెండ్స్ లిస్టును బాల‌య్య ఆక్ర‌మించేశాడు. హ్యాపీ బ‌ర్త్ డే ఎన్బీకే, బీబీ3 ఫ‌స్ట్ రోర్, ఎన్బీకే 106.. ఈ మూడు హ్యాష్ ట్యాగ్స్ ఇండియా లెవెల్లో టాప్‌లో ట్రెండ్ అవడం మొద‌లైంది. హైద‌రాబాద్ స్థాయిలో అయితే ఇవే తొలి మూడు స్థానాల్ని ఆక్ర‌మించాయి. సోష‌ల్ మీడియాలో బాల‌య్య ఫ్యాన్స్ కొంచెం వీక్ అనుకుంటాం కానీ.. టీజ‌ర్ లాంచ్ అవ్వ‌గానే అంద‌రూ యాక్టివ్ అయిపోయారు. ఈ ఒక్క టీజ‌ర్‌తో సినిమాపై అంచ‌నాలు పెరిగిపోయాయి. సినిమాకు ఈజీగా బిజినెస్ అయ్యే ప‌రిస్థితి వ‌చ్చేసిందంటే కూడా అతిశ‌యోక్తి కాదు.