జ‌గ‌న్ ‘సినిమా’ క‌త్తి.. అన్ని వైపులా ప‌దును

ఆంధ్రప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ప‌రిష్క‌రించాల‌నుకుంటే స‌మ‌స్య‌ల‌కు లోటు లేదు. సాధార‌ణంగా ఉన్న స‌మ‌స్య‌ల‌కు తోడు.. ప్ర‌భుత్వ నిర్వాకం వ‌ల్ల వ‌ల్ల త‌లెత్తుతున్న ఇబ్బందులు లెక్క‌లేన‌న్ని ఉన్నాయి. కానీ అవేవీ కాకుండా సినిమా టికెట్ల విష‌యంలో కొత్త‌గా ఓ స‌మ‌స్య‌ను సృష్టించి దాన్ని న‌మ్ముకున్న వాళ్ల‌ను తెగ ఇబ్బంది పెడుతోంది జ‌గ‌న్ స‌ర్కారు. జ‌నాలు ఇది త‌మ స‌మ‌స్య అని చెప్ప‌కున్నా స‌రే.. ప‌ట్టుబ‌ట్టి టికెట్ల రేట్ల మీద నియంత్ర‌ణ తెచ్చింది ప్ర‌భుత్వం.

ఇక ఈ స‌మ‌స్య‌ను రోజు రోజుకూ జ‌ఠిలంగా మారుస్తూ.. రాష్ట్రంలో అది త‌ప్ప వేరే ఇష్యూనే లేన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ విష‌యంలో కోర్టు కేసులు ఎదురైనా, ఇంకే ఇబ్బందులు త‌లెత్తినా.. ఎంత దూర‌మైనా వెళ్లి పంతం నెగ్గించుకోవాల‌ని చూస్తోంది జ‌గ‌న్ స‌ర్కారు. ప‌ట్టుబ‌ట్టి టికెట్ల రేట్ల‌ను నియంత్రించ‌డం.. కోర్టు దీనికి బ్రేకులేసేలా క‌నిపించ‌గానే థియేట‌ర్ల మీద దాడులు చేయ‌డం.. హైకోర్టులో వ్య‌తిరేక తీర్పు వ‌స్తే డివిజ‌న్ బెంచ్‌కు వెళ్ల‌డం.. ఇలా జ‌గ‌న్ ప్ర‌భుత్వం పంతం నెగ్గించుకోవ‌డానికి చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు.

టికెట్ల ధరల్ని నియంత్రిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో మీద కొందరు ఎగ్జిబిటర్లు కోర్టుకు వెళ్లడం.. దాని మీద స్టే రావడం.. మళ్లీ ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లడం.. తదుపరి విచారణ  జనవరి తొలి వారానికి వాయిదా పడటం తెలిసిందే. మాకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్తారా అన్నట్లుగా థియేటర్ల మీద అధికారులతో దాడులు చేయిస్తోంది ప్రభుత్వం. నిబంధనలు పాటించని థియేటర్లను సీజ్ చేస్తోంది. ఇది తదుపరి విచారణలో తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ప్రభుత్వం పరోక్షంగా హెచ్చరిస్తున్నట్లే ఉంది ప్రస్తుత వ్యవహారం చూస్తుంటే.

తర్వాత ప్రభుత్వం ఏం చేయబోతోందన్న ఉత్కంఠ, ఆందోళన కూడా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల్లో వ్యక్తమవుతోంది. ఒకవేళ జనవరి తొలి వారంలో జరిగే విచారణ అనంతరం తీర్పులో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలితే మాత్రం కచ్చితంగా కరోనా పేరుతో థియేటర్లపై మళ్లీ ఆంక్షలు పెట్టడమే తరువాయి అంటున్నారు. ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఎలాగూ ముందు జాగ్రత్త చర్యలు సూచిస్తుండటంతో నైట్ కర్ఫ్యూ పెట్టి సెకండ్ షోలు రద్దు చేయించడం, 50 శాతం ఆక్యుపెన్సీ పెట్టడం లాంటి చర్యలు జగన్ సర్కారు చేపట్టడం ఖాయం అంటున్నారు. మొత్తంగా చూస్తే ఫిలిం ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వం దగ్గర చాలా ఆప్షన్లు ఉన్నాయన్నది స్పష్టం.