‘పుష్ప’ కథకు బీజం అలా పడిందిచాలా వరకు కథలు ఊరికే ఊహల్లో పుట్టేయవు. మన జీవిత అనుభవాలే వాటికి స్ఫూర్తిగా నిలుస్తుంటాయి. ఒక భారీ కథకు కూడా చిన్న సంఘటన స్ఫూర్తిగా మారొచ్చు. ఆ సంఘటను చుట్టూ తర్వాత కథను అల్లి ఒక పెద్ద సినిమాగా మలచొచ్చు. సుకుమార్ కూడా అదే పని చేశాడట ‘పుష్ప’ విషయంలో. తెలుగు సినిమాలో ఇప్పటిదాకా చూడని ఎర్రచందనం బ్యాక్‌డ్రాప్‌లో సరికొత్త కథను ఎంచుకుని తనదైన శైలిలో ‘పుష్ప’ సినిమా తీశాడు సుకుమార్.
ఐతే ఈ కథ నడిచేది చిత్తూరు జిల్లాలో అయినా.. తాను ఈ కథ రాసే దిశగా స్ఫూర్తి రగిలించింది తన అన్నయ్య జీవితంలో జరిగిన ఒక సంఘటనే అని సుకుమార్ వెల్లడించాడు. తన మూడో అన్నయ్య అయిన విజయ్ జీవితంలో జరిగిన ఇన్సిడెంట్ నుంచే హీరో పాత్ర పుట్టిందని సుక్కు వెల్లడించాడు. తన తండ్రి రకరకాల వ్యాపారాలు చేసి నష్టాల పాలైన సమయంలో తన అన్నయ్య బాధ్యతలు నెత్తిన వేసుకుని రైస్ మిల్లులో పని చేశాడని.. ఐతే తన పని పూర్తయ్యాక రైస్ మిల్ బయట కూర్చుని కాలు మీద కాలేసుకుని టీ తాగుతుంటే..
సూపర్ వైజర్ వచ్చి ఓనర్ ముందు అలా కూర్చున్నావేంటని అడిగితే.. ఈ కాలు నాది, ఆ కాలు నాది.. నా కాలు మీద నా కాలేసుకుంటే ఆయనకేంటి అని తన అన్నయ్య అన్నాడని.. ఈ సంగతి తనతో పంచుకున్నాడని.. ఒక యాటిట్యూడ్ ఉన్న హీరో పాత్ర చుట్టూ సినిమా తీయాలనుకున్నపుడు తనకు ఈ సంఘటనే గుర్తుకొచ్చి దాని ఇన్‌స్పిరేషన్‌తోనే పాత్రను అల్లానని సుక్కు వెల్లడించాడు.
అప్పుడే కాక తన జీవితంలో అనేక రకాలుగా విజయ్ అన్నయ్య అండగా నిలిచాడంటూ ఆయనకు ‘పుష్ప’ సక్సెస్ మీట్‌లో కృతజ్ఞతలు చెప్పాడు సుకుమార్. ఇక ‘పుష్ప’ సినిమాలో చూపించే ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించిన చాలా సన్నివేశాలు వాస్తవంగా జరిగినవే. ఇందులోని కొన్ని పాత్రలకు కూడా రియల్ స్మగ్లర్లు స్ఫూర్తిగా నిలవడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates