ఐశ్వర్యరాయ్‌కు షాకిచ్చిన ఈడీ.. సమన్లు జారీ!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ) షాకిచ్చింది. పనామా పేపర్స్ లీక్ కేసులో ఐశ్వర్యరాయ్‌కు సమన్లు జారీ చేసింది ఈడీ. పన్నులు ఎగ్గొట్టడానికి దీవుల్లో కంపెనీలు ఏర్పాటు చేసినట్లు పనామా పేపర్లో వచ్చిన వార్తల ఆధారంగా ఈడీ కేసును నమోదు చేసింది. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఈరోజు హాజరు కావాలని ఐశ్వర్యరాయ్‌కు సమన్లు జారీ చేసింది. నిజానికి ఇంతకుముందే ఐశ్వర్యరాయ్‌ ను ఈడీ ఆఫీస్ కు రావాలని కోరారు.

కానీ ఆమె ఏవో కారణాలు చెప్పి తప్పించుకుంది. ఈసారి మాత్రం ఆమె తప్పకుండా హాజరు కావాల్సిందేనని ఈడీ స్పష్టం చేసింది. ఈ ఆరోపణలపై ఆమెని విచారించనుంది ఈడీ. దీనిపై ఐశ్వర్యరాయ్‌ ఇప్పటివరకు స్పందించలేదు. నెల రోజుల క్రితం అభిషేక్‌ బచ్చన్‌కు కూడా ఈడీ సమన‍్లు జారీ చేసింది. దీంతో ఆయన అధికారుల ముందు హాజరయ్యారు. ఈడీ అధికారులకు అభిషేక్‌  కొన్ని పత్రాలను అందజేశారు.

ఇప్పుడు ఐశ్వర్యరాయ్‌కు సమన్లు జారీ కావడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ పనామా పేపర్స్ కేసులో భారత్ నుంచి సుమారు 500 మందికి ప్రమేయం ఉన్నట్లు సమాచారం. ఇందులో నాయకులు, నటులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు ఇలా సొసైటీలో పేరున్న చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నవారు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

ఇంతకీ ఈ పనామా పేపర్స్ ఏంటంటే.. కొన్ని దేశాల్లో రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సంపన్న కుటుంబాలకు చెందిన వారు ఇతర దేశాల బ్యాంకుల్లో తమ నగదును దాచుకున్నారు. ఆ విధంగా స్వదేశానికి చెల్లించాల్సిన పన్నులను ఎగ్గొడుతున్నారు. ఈ విషయం పనామా పేపర్స్ నుంచి లీక్ అవ్వడంతో విషయం బయటపడింది. దీంతో ఇప్పుడు అధికారులు పన్నులు ఎగ్గొట్టిన వారిపై దృష్టి పెట్టారు.