టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ మాస్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకడు. ఇక కెరీర్ ఆరంభం నుంచి మాస్ సినిమాలతోనే పేరు తెచ్చుకుని.. మగధీర నుంచి మరో లెవల్ సినిమాలు తీస్తున్న రాజమౌళి ఇప్పటిదాకా బాలయ్యతో ఒక్క సినిమా కూడా చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. బాలయ్య మీద ఎంతో అభిమానం చూపించే జక్కన్న ఆయనతో సినిమా కోసం ఇప్పటిదాకా ప్రయత్నించలేదా.. బాలయ్య తనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించలేదా అన్న సందేహాలు జనాల్లో ఉన్నాయి.
తాను హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోకు రాజమౌళి అతిథిగా రావడంతో నేరుగా బాలయ్యే ఈ విషయం గురించి మాట్లాడాడు. ఇప్పటివరకూ మన కాంబినేషన్ పడలేదు. నా అభిమానులు మిమ్మల్ని బాలయ్యతో సినిమా ఎప్పుడు చేస్తారు అని అడిగితే ఆయన్ని నేను హ్యాండిల్ చేయలేను అన్నారట ఎందుకు అని రాజమౌళిని సూటిగా అడిగేశాడు బాలయ్య.
దీనికి రాజమౌళి ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘‘భయంతోనే అలా అన్నాను. చిన్న వాళ్ల దగ్గరి నుంచి పెద్ద వాళ్ల వరకూ మీరు అందరికీ గౌరవం ఇస్తారు. చాలా పద్ధతిగా ఉంటారు. నేను సినిమా షూటింగ్ చేసేటప్పుడు ఎలా ఉంటానో నాకు తెలియదు. నాకు ఎవరైనా ‘గుడ్ మార్నింగ్’ చెబితే చిరాకు. షాట్ పెట్టుకుని పక్కన హీరో ఎండలో నిలబడ్డాడా? వానలో నిలబడ్డాడా? అన్నది చూడను. నా ఫ్రేమ్ రెడీ అయ్యే వరకూ హీరో కష్ట సుఖాలు ఆలోచించలేను. ఒక వేళ మిమ్మల్ని డైరెక్ట్ చేయాల్సి వస్తే, మీకేమైనా కోపం వస్తుందేమోనని భయం. నాకు అదే టెన్షన్’’ అని రాజమౌళి వివరించాడు.
దీనిపై బాలయ్య స్పందిస్తూ.. తాను ఒకసారి క్యారావ్యాన్‌లోని నుంచి బయటకు వస్తే, ఆ రోజు షూటింగ్ అయ్యే వరకూ లోపలకి వెళ్లనని, గొడుగు పట్టనివ్వనని చెప్పాడు. తన తండ్రి దగ్గర అసిస్టెంట్‌గా పని చేసినపుడు రెండు మూడుసార్లు బాలయ్యను కలిశానని.. ఛత్రపతి సమయంలో బాలయ్యకు మగధీర కథ కూడా చెప్పానని రాజమౌళి ఈ కార్యక్రమంలో వెల్లడించడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates