బాత్రూంలో కూర్చుని చూసే సినిమా అట!

ఇప్పటి జనాల్లో వెటకారం పీక్స్ లో ఉంటోంది. ఏదైనా నచ్చకపోతే దాన్ని పబ్లిగ్గా ఎండగట్టేస్తున్నారు. సినిమాలను అయినా, రాజకీయ నాయకులనైనా, మీడియాను అయినా ట్రోల్ చేసేస్తున్నారు. అయితే ఇలాంటి జమానాలో కూడా రాంగోపాల్ వర్మ తాను తీసే సినిమాల్లో కంటెంట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం లేదు. ఏదైనా సిట్యుయేషన్ వచ్చినపుడు అందులోంచి బయటకు రావడానికి తన బుర్ర బాగానే వాడతాడు. ఉదాహరణకు సినిమా థియేటర్లు లేని టైంలో ఓటిటీ దయ దాక్షిణ్యాలపై ఆధారపడకుండా పే పర్ వ్యూ పద్ధతిని అమల్లోకి తెచ్చాడు. అయితే ఈ పద్ధతిలో క్లైమాక్స్ లాంటి సినిమాను చూపించి 100 రూపాయలు పెట్టి కొన్న వారితో అక్షింతలు వేయించుకుంటున్నాడు. ఈ సినిమా కంటే కూడా దీనిపై వస్తోన్న కామెంట్స్ ఎక్కువ వినోదాన్ని అందిస్తున్నాయి.

ఓటిటీలో వచ్చే సినిమాలు ఇంటి వసారాలో టీవీలో ఠీవిగా చూస్తే, క్లైమాక్స్ మాత్రం బాత్రూమ్లో కూర్చుని ఒంటరిగా చూసుకోవాలట. ఎందుకనేది ట్రైలర్ చుసిన వాళ్లకు ఇట్టే అర్ధమై ఉండాలి. తన సినిమాలపై ఎలాంటి కామెంట్స్ వచ్చినా కానీ తన పని తాను చేసేసుకునే వర్మ ఆల్రెడీ ఈ పద్ధతిలో రెండో సినిమా నేకెడ్ (నగ్నం) సిద్ధం చేస్తున్నాడు. ఈసారి రేట్ 100 కాకుండా 200 పెడతాడట. ఆయన కాన్ఫిడెన్స్ ని మాత్రం మెచ్చుకుని తీరాల్సిందే.