అలా పిలిచారని ఫైర్ అయిన ప్రియాంక

ఒకప్పుడు బాలీవుడ్‌లో చక్రం తిప్పిన ప్రియాంకా చోప్రా.. హాలీవుడ్‌ మూవీలో నటించిన తర్వాత మెల్లగా రూటు మార్చేసింది. నిక్‌ జోనాస్‌ను పెళ్లాడిన తర్వాత ఒక ఇండియన్ సినిమాకి అందనంత దూరం వెళ్లిపోయింది. హాలీవుడ్‌ చిత్రాల మీద మాత్రమే ఆమె దృష్టి ఉంది. ప్రస్తుతం ‘ద మ్యాట్రిక్స్‌ రిజరెక్షన్’ మూవీలో నటిస్తోంది. డిసెంబర్ 22న ఈ సినిమా రిలీజ్ కానుంది. దాంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది పీసీ.

అయితే రీసెంట్‌గా జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో మీడియా మీద ఫైర్ అయ్యింది ప్రియాంక. నన్ను అలా ఎలా అంటారు అంటూ విరుచుకుపడింది. ఇంతకీ వాళ్లు ఏమన్నారనేగా? ఏం లేదు.. నిక్ జోనాస్ భార్య ప్రియాంక అన్నారంతే. అది పీసీకి అస్సలు నచ్చలేదట. ‘నేను అత్యంత పాపులర్ మూవీ ఫ్రాంచైజీలో ఒకదాన్ని ప్రమోట్ చేస్తున్నాను. అయినా కూడా నన్ను ద వైఫ్ ఆఫ్ అంటూ ప్రస్తావిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు’ అంటూ చిర్రుబుర్రులాడింది.

అక్కడితో అయిపోలేదు. తర్వాత ఈ విషయాన్ని మహిళల సమస్యలకి కూడా కనెక్ట్ చేసి మాట్లాడింది. ‘ఎప్పుడూ మహిళల విషయంలోనే ఇలా జరుగుతుంది. వాళ్లు ఎంత కష్టపడినా ఫలానా వారి కూతురు, ఫలానా వాడి భార్య అనే చెప్తారు. ఇలా అయితే ఎలా? ఈ పద్ధతి మారకపోతే మహిళల పురోగతి ఎప్పటికి సాధ్యపడుతుంది’ అంటూ ఆవేశంగా మాట్లాడింది పీసీ.

పబ్లిక్‌లో భర్తతో రొమాన్స్ చేస్తూ చాలాసార్లు మీడియా దృష్టిలో పడింది పీసీ. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పట్టించుకోకుండా ఈ జంట లిమిట్స్ దాటుతూ ఉంటుందని చాలాసార్లు వార్తలు రాయడం జరిగింది. మరి భర్తను అంతగా పెనవేసుకుపోయే ప్రియాంకకి అతని భార్య అని చెబితే వచ్చిన నష్టమేమిటా అంటూ కొందరు తెగ ఆలోచిస్తున్నారు. హాలీవుడ్‌లో ఎదగాలని చూస్తున్న ఆమెని తనకి తానుగా గుర్తించకపోవడం కోపం తెప్పించిందని మిగతావారు అంటున్నారు. కారణం ఏదైనా తన కామెంట్స్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది పీసీ.