సమంత సినిమా.. 1 స్టార్ రేటింగిచ్చిన డైరెక్టర్

సోషల్ మీడియాలో తనకు కౌంటర్లు ఇచ్చే నెటిజన్లకు షార్ప్‌గా రివర్స్ కౌంటర్లు ఇస్తుంటుంది దర్శకురాలు నందిని రెడ్డి. ఇంతకుముందు ‘లస్ట్ స్టోరీస్’ తెలుగు వెర్షన్ గురించి సోషల్ మీడియా వస్తున్న రూమర్ల గురించి అలాగే స్పందించింది. ఇప్పుడు తన తర్వాతి సినిమా గురించి ప్రచారాలు సాగిస్తున్న వారికి నందిని తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది.

గత ఏడాది ‘ఓ బేబీ’ సినిమాతో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది నందిని. ఇది కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఐతే సమంతతో వరుసగా రెండు సినిమాలు (జబర్దస్త్, ఓ బేబీ) చేసిన నందిని.. తర్వాతి సినిమాను కూడా ఆమెతోనే చేయనుందని.. మళ్లీ వీళ్లిద్దరూ కలిసి ఇంకో కొరియన్ మూవీనే తెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. దీనిపై నందిని స్పందించింది.

ముందుగా తన తర్వాతి సినిమా రీమేక్ కాదని ఆమె స్పష్టం చేసింది. ఇంతకుముందు ప్రకటించినట్లే స్వప్న సినిమా బేనర్లో తన తర్వాతి చిత్రం ఉంటుందని.. అది ఒరిజినల్ స్క్రిప్టుతో తెరకెక్కబోతోందని ఆమె వెల్లడించింది. ఇక సమంతతో కలిసి తాను మళ్లీ ఎప్పుడు సినిమా చేసినా దాన్ని చాలా సంతోషంతో ప్రకటిస్తామని.. కాబట్టి జనాలు తర్వాతి రూమర్ మీద దృష్టిపెట్టాలని సూచించింది నందిని.

అంతా అయ్యాక చివర్లో సమంతతో తన సినిమా గురించి వచ్చిన తాజా రూమర్‌కు తాను ఐదుకు ఒక్క స్టార్ రేటింగ్ ఇస్తున్నట్లు నందిని పేర్కొనడం విశేషం. నందిని చివరి సినిమా అఫీషియల్ రీమేక్ కాగా.. దానికి ముందు చేసిన ‘జబర్దస్త్’ ఫ్రీమేక్. బాలీవుడ్ మూవీ ‘బ్యాండ్ బాజా బారాత్’ను కాపీ కొట్టి ఆ సినిమా తీయడంపై అప్పట్లో పెద్ద దుమారమే లేచింది. ఈ నేపథ్యంలో తనపై రీమేక్ డైరెక్టర్ ముద్ర వేసేస్తున్నారనే అసహనం పరోక్షంగా నందిని కౌంటర్లలో కనిపిస్తోందన్నది స్పష్టం.