యుఎస్‌లో తెలుగు ప్రేక్షకుల అభిరుచి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అక్కడ క్లాస్ సినిమాలకే పట్టం కడుతుంటారు. మాస్ సినిమాలు వాళ్లకు అంతగా రుచించవు. మిగతా హీరోల సంగతి పక్కన పెడితే ఎక్కువగా మాస్ మసాలా సినిమాలు చేసే నందమూరి బాలకృష్ణకు యుఎస్‌లో సరైన మార్కెట్ లేదు. గౌతమీపుత్ర శాతకర్ణిని మినహాయిస్తే ఏ బాలయ్య చిత్రమూ అక్కడ భారీ వసూళ్లు సాధించింది లేదు. అది మినహా బాలయ్యకు మిలియన్ డాలర్ల సినిమానే లేదు యుఎస్‌లో.
శాతకర్ణి తర్వాత బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన లెజెండ్ యుఎస్‌లో హాఫ్ మిలియన్ మార్కును కూడా అందుకోలేదు. ఇప్పుడు బాలయ్య కొత్త చిత్రం అఖండ కూడా ఊర మాస్ సినిమా కావడం, పైగా కరోనా తర్వాత యుఎస్‌లో తెలుగు సినిమాల మార్కెట్ బాగా దెబ్బ తినడంతో ఈ మూవీ మహా అయితే హాఫ్ మిలియన్ మార్కును టచ్ చేస్తే ఎక్కువ అనుకున్నారు.
కానీ అంచనాలను తలకిందులు చేస్తూ అఖండ యుఎస్‌లో ఇరగాడేసింది. ప్రిమియర్లతోనే 3 లక్షల డాలర్లకు పైగా కొల్లగొట్టి ఔరా అనిపించింది. తొలి వారాంతం అయ్యేసరికి వసూళ్లు 8 లక్షల డాలర్ల మార్కును దాటేశాయి. ఆ తర్వాత సినిమా జోరు తగ్గింది. అలాగని దాని రన్ మాత్రం ఆగిపోలేదు. రెండో వీకెండ్లో కూడా ఓ మోస్తరు వసూళ్లు సాధించి మిలియన్ డాలర్ మార్కుకు అత్యంత చేరువగా వచ్చింది.
రెండో వీకెండ్ అయ్యేసరికి అఖండ యుఎస్ వసూళ్లు 9.94 లక్షల డాలర్లకు చేరుకున్నాయి. ఇంకో 6 వేల డాలర్లు వస్తే ఈ చిత్రం మిలియన్ డాలర్ మార్కును అందుకుంటుంది. అదేమంత కష్టం కాకపోవచ్చు. ఇలాంటి ఊర మాస్ మూవీతో, ఈ టైంలో మిలియన్ డాలర్ల మార్కును అందుకోవడం బాలయ్యకు గొప్ప ఘనతే. రాబోయే పెద్ద సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యుఎస్‌లోనూ మంచి ఉత్సాహాన్ని తీసుకొచ్చింది అఖండ.