అల్లు అర్జున్, సుకుమార్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం పుష్ప. దీనిపై అంచనాలు మామూలుగా లేవు. అందుక్కారణం అల వైకుంఠపురములో లాంటి నాన్ బాహుబలి హిట్ తర్వాత బన్నీ.. దీని కంటే ముందు నాన్ బాహుబలి హిట్‌గా ఉన్న రంగస్థలం తర్వాత సుకుమార్ చేసిన సినిమా కావడమే ఇందుక్కారణం. బన్నీ, సుక్కు ఇంతకుముందు చేసిన సినిమాలన్నింటికంటే ఊర మాస్‌గా ఈ సినిమా తెరకెక్కిందని ప్రోమోల్లోనే అర్థమైంది.
ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అందుకు తగ్గట్లే ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజిలో జరుగుతున్నాయి. ఆన్ లైన్ టికెటింగ్ యాప్స్‌లో పెట్టిన టికెట్లు పెట్టినట్లే అయిపోతున్నాయి. దీంతో పుష్పకు భారీ ఓపెనింగ్స్ ఖాయం అనిపిస్తోంది. కానీ ఈ సినిమాకు రంగస్థలం లాగా.. లేదా అల వైకుంఠపురములో లాగా లాంగ్ రన్ ఉంటుందా అన్నదే డౌట్‌గా ఉంది.
పుష్పకు పోటీకి ముందు, వెనుక చాలా సినిమాలు వస్తుండటమే దాని మేకర్స్‌లో కొంత ఆందోళన రేకెత్తిస్తోంది. పుష్ప కంటే ముందు రోజు హాలీవుడ్ మూవీ స్పైడర్ మ్యాన్ భారీ అంచనాలతో వస్తోంది. దీనికి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజిలో జరుగుతున్నాయి. ఇక 22న రాబోతున్న మరో హాలీవుడ్ మూవీ మ్యాట్రిక్స్ మీదా మంచి అంచనాలున్నాయి. దానికి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగానే జరుగుతాయని భావిస్తున్నారు.
ఇక 24న బాలీవుడ్ మూవీ 83 వివిధ భాషల్లో మంచి అంచనాలతో రిలీజవుతోంది. అదే రోజు తెలుగులో నాని మూవీ శ్యామ్ సింగరాయ్ రిలీజవుతోంది. ఇన్ని సినిమాలు వారం వ్యవధిలో వస్తుండటంతో పుష్ప వసూళ్ల మీద కచ్చితంగా ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఇతర భాషా చిత్రాల వల్ల తెలుగు రాష్ట్రాల అవతల పుష్ప కలెక్షన్లకు గండి పడటం ఖాయం. పాన్ ఇండియా లెవెల్లో భారీ హిట్ కొట్టాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున ఈ చిత్రాన్ని వివిధ భాషల్లో రిలీజ్ చేయిస్తున్న బన్నీ.. ఈ పోటీని ఎలా తట్టుకుని నెగ్గుకొస్తాడో చూడాలి.