‘మా’ ట్విస్ట్.. PR ప్యానెల్ అవుట్!

రెండు నెలల కిందట ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికల వ్యవహారం ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా ఎన్నికల ముంగిట వాదోపవాదాలు.. విమర్శలు ప్రతి విమర్శలు.. ఆరోపణలు ప్రత్యారోపణలు నడిచాయి. ఎన్నికల సందర్భంగా ఎంత రచ్చ జరగాలో అంతా జరిగింది. ఎన్నికల అనంతరం కూడా వివాదం సద్దుమణగలేదు. ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణు ప్యానెల్‌తో కలిసి పని చేయడం ఇష్టం లేకపోవడంతో, వారి పనికి తాము అడ్డం రాబోమంటూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి వివిధ పదవులకు గెలిచిన వాళ్లందరూ రాజీనామా చేయడం తెలిసిందే.

ఐతే ఈ రాజీనామాలను తాము ఆమోదించబోమంటూ ముందు మంచు విష్ణు వర్గం నుంచి వ్యాఖ్యలు వినిపించాయి. దీనిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని మంచు విష్ణు పేర్కొన్నాడు. కానీ తర్వాత దీని గురించి ఎలాంటి చర్చా లేదు. ఐతే ఇప్పుడు హఠాత్తుగా ఈ రాజీనామాలపై ‘మా’ కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామాలను ఆమోదించేయడం జరిగింది.

దీంతో ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీకాంత్ సహా ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి ఎవ్వరూ ‘మా’ కార్యవర్గంలో లేనట్లే. ఈ విషయంలో మంచు విష్ణు ఆచితూచి వ్యవహరిస్తాడేమో.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులకు సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తాడేమో అనుకున్నారు. ఆ ప్రయత్నాలు అతను చేశడో లేదో తెలియదు. ఇప్పుడిలా రాజీనామాలను ఆమోదించేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

దీంతో ఇక మంచు విష్ణు నేతృత్వంలోని కార్యవర్గానికి ‘మా’లో ఎదురు లేనట్లే. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామాలతో దాదాపు సగం కార్యవర్గం ఖాళీ అవుతోంది. మరి ఈ పదవులన్నింటినీ ఖాళీగానే ఉంచేస్తారా.. లేక ఎవరినైనా ఆ పదవులకు నామినేట్ చేస్తారా అన్నదే తేలాల్సి ఉంది. ఐతే తమ పదవులకు రాజీనామా చేసినప్పటికీ ‘మా’లో ఏం జరిగినా ప్రశ్నిస్తామని.. ప్రతి నిర్ణయాన్నీ సమీక్షిస్తామని, హామీల అమలు కోసం పట్టుబడతామని ప్రకటించిన ప్రకాష్ రాజ్ ప్యానెల్ మున్ముందు ఎలా స్పందిస్తుందో చూడాలి.