బాల‌య్య సెంచ‌రీ కొట్టేశాడ‌హో..

నంద‌మూరి బాల‌కృష్ణ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఆయ‌న సినిమా తొలిసారిగా వంద కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్లు సాధించింది. డిసెంబ‌రు 2న విడుద‌లైన అఖండ ప‌ది రోజుల్లో రూ.100 కోట్ల గ్రాస్ మార్కును అందుకుని ట్రేడ్ పండిట్ల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఇప్ప‌టిదాకా బాల‌య్య కెరీర్లో హైయెస్ట్ గ్రాస‌ర్ గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణినే. తొలి వారంలోనే ఆ సినిమా క‌లెక్ష‌న్ల‌ను అఖండ దాటేసింది.

ఇప్పుడు వంద కోట్ల గ్రాస్ మార్కునూ ట‌చ్ చేసేసింది. బాల‌య్య వీక్ జోన్ అయిన నైజాంలోనే ఈ చిత్రం రూ.26 కోట్ల‌కు పైగా గ్రాస్ క‌లెక్ట్ చేయ‌డం విశేషం. ఆంధ్రా, రాయ‌ల‌సీమ క‌లిపి రూ.50 కోట్ల‌కు పైగానే గ్రాస్ వ‌చ్చింది. ఇండియాలోని మిగ‌తా ప్రాంతాలు.. అలాగే ఓవ‌ర్సీస్ క‌లిపి ఈ చిత్రం అటు ఇటుగా పాతిక కోట్ల దాకా గ్రాస్ రాబ‌ట్టింది.

మొత్తంగా సినిమా వంద కోట్ల మార్కును అందుకుంది. షేర్ రూ.60 కోట్ల‌కు చేరువ‌గా ఉంది. తొలి వారంలోనే అఖండ రూ.80 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్లు సాధించ‌డం విశేషం. ఈ వారం రిలీజైన ఏ సినిమాలూ ప్ర‌భావం చూప‌క‌పోవ‌డంతో అఖండ‌నే బాక్సాఫీస్ లీడ‌ర్‌గా కొన‌సాగుతోంది. రెండో వారంలో కూడా ఈ చిత్రానికి హౌస్ ఫుల్స్ ప‌డుతుండ‌టం విశేషం. కెరీర్లో ఈ ద‌శ‌లో బాల‌య్య వంద కోట్ల మార్కును అందుకుంటాడ‌ని ఎవ‌రికీ పెద్ద‌గా అంచ‌నాలు లేవు.

అఖండ‌కు ముందు బాల‌య్య మార్కెట్ ఎంత‌గా ప‌త‌నం అయిందో తెలిసిందే. య‌న్.టి.ఆర్, రూల‌ర్ సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దారుణ ఫ‌లితాన్నందుకున్నాయి. రూల‌ర్‌కు గ్రాస్ క‌లెక్ష‌న్లు కూడా 15 కోట్ల లోపే వ‌చ్చాయి. అలాంటిది అఖండ రూ.100 కోట్ల గ్రాస్ మార్కును అందుకోవ‌డం అసాధార‌ణ విష‌యమే. యావ‌రేజ్ టాకే వ‌చ్చినా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈ చిత్రానికి అన్నీ భ‌లేగా క‌లిసి రావ‌డంతో వ‌సూళ్ల మోత మోగిపోయింది.