రాజ‌మౌళి రాంగ్ స్ట్రాట‌జీ?

ఆరేళ్ల‌ కింద‌ట బాహుబ‌లి: ది బిగినింగ్ ట్రైల‌ర్‌ను ప్ర‌త్యేకంగా థియేట‌ర్ల‌లో లాంచ్ చేసి కొత్త ట్రెండుకు శ్రీకారం చుట్టాడు రాజ‌మౌళి. ఆ ఆలోచ‌న మంచి ఫ‌లితాన్నే ఇచ్చింది. మార్కెటింగ్ ప‌రంగా ఈ టెక్నిక్ బాగా ఉప‌యోగ‌ప‌డింది.

ట్రైల‌ర్ నిడివి రెండున్నర నిమిషాలే అయిన‌ప్ప‌టికీ.. ఆ సినిమాపై అప్పటికున్న హైప్ దృష్ట్యా ప్రేక్ష‌కులు పెద్ద ఎత్తున అదే ప‌నిగా థియేట‌ర్ల‌కు వెళ్లి దాన్ని చూసి వ‌చ్చారు. కొంచెం గ్యాప్ త‌ర్వాత ట్రైల‌ర్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఇప్పుడు త‌న కొత్త చిత్రం ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ విష‌యంలోనూ జ‌క్క‌న్న ఇదే స్ట్రాట‌జీని అనుస‌రిస్తున్నాడు.

ఈ ట్రైల‌ర్‌ను థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయాల‌నుకోవ‌డం ఓకే కానీ.. త‌ర్వాత సోష‌ల్ మీడియాలో ట్రైల‌ర్ లాంచ్‌కు చాలా గ్యాప్ ఇవ్వ‌డ‌మే అభిమానుల‌కు రుచించడం లేదు. ఉద‌యం 10 గంట‌ల‌కు థియేట‌ర్ల‌లో ట్రైల‌ర్ లాంచ్ చేసి సాయంత్రం 4కు డిజిట‌ల్ రిలీజ్ ఏంటో అర్థం కావ‌డం లేదు.

ఆరేళ్ల ముందుతో బాహుబ‌లి ట్రైల‌ర్ లాంచ్ టైంతో పోలిస్తే ఇప్పుడు ప‌రిస్థితులు వేరు. ఆర్ఆర్ఆర్‌కు హైప్ త‌క్కువేమీ కాదు కానీ.. మ‌రీ బాహుబ‌లికి ముందున్నంత క్యూరియాసిటీ అయితే లేదు. పైగా అప్పుడు మొబైల్ ఇంట‌ర్నెట్, సోష‌ల్ మీడియా విప్ల‌వం ఇప్ప‌ట్లా లేదు. ప్ర‌తి ఒక్క‌రూ యూట్యూబ్‌లో ట్రైల‌ర్ చూడాల‌న్న ఆస‌క్తితో ఉంటారు. ట్రైల‌ర్ లాంచ్‌కు ఎంచుకున్న థియేట‌ర్లు త‌క్కువ‌. అంద‌రికీ థియేట‌ర్ల‌కు వెళ్లి చూసే స‌మ‌యం, ఓపిక‌, ఆస‌క్తి ఉండ‌వు.

అలాంట‌పుడు ఉద‌యం థియేట‌ర్ల‌లో ట్రైల‌ర్ లాంచ్ అయితే సాయంత్రం వ‌రకు ఎదురు చూడ‌టం క‌ష్ట‌మే. ఈలోపు థియేట‌ర్ల‌లో ట్రైల‌ర్ రికార్డ్ చేసి పైరేటెడ్ వెర్ష‌న్ సోష‌ల్ మీడియాలో వ‌దులుతారు. సాయంత్రం అస‌లు ట్రైల‌ర్ వ‌దిలేస‌రికి క్యూరియాసిటీ ఉండ‌దు. కాబ‌ట్టి ట్రైల‌ర్‌ను థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శించాక సాధ్య‌మైనంత త్వ‌ర‌గా యూట్యూబ్‌లో లాంచ్ చేసేయ‌డం బెట‌ర్. సాయంత్రం 4 వ‌ర‌కు మాత్రం అభిమానుల‌ను ఎదురు చూసేలా చేస్తే ఫ్ర‌స్టేష‌న్ త‌ప్ప‌దు.