బాల‌కృష్ణ‌తో శంక‌రాచార్య‌


తెలుగులో ఇప్పుడున్న హీరోల్లో పౌరాణిక సినిమా చేయాలంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు నంద‌మూరి బాల‌కృష్ణ‌దే. ఈ విష‌యంలో త‌న‌కు సాటి, పోటీ లేర‌ని స్వ‌యంగా బాల‌య్యే చెబుతుంటాడు. అదేమీ అతిశ‌యోక్తిగా అనిపించ‌దు కూడా. తెలుగులో పౌరాణిక‌, జాన‌ప‌ద‌, ఆధ్యాత్మిక చిత్రాలు పూర్తిగా ఆగిపోతున్న ద‌శ‌లో భైర‌వ‌ద్వీపం, శ్రీకృష్ణార్జున యుద్ధం లాంటి సినిమాలు చేశాడు బాల‌య్య‌.

ఆ త‌ర్వాత కూడా పాండురంగ‌డు, శ్రీరామ‌రాజ్యం లాంటి చిత్రాల్లో న‌టించాడు. ఇక కొన్నేళ్ల కింద‌ట చారిత్ర‌క నేప‌థ్యంలో గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా చేస్తే దానికి మంచి ఫ‌లితం  కూడా వ‌చ్చింది. ఐతే ఇక‌పై బాల‌య్య‌తో ఇలాంటి సినిమాలు చేయ‌డం సందేహంగానే ఉంది. ఈ నంద‌మూరి హీరోతో ఆ టైపు సినిమాలు చేసే ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు ఎవ‌రు అనే ప్ర‌శ్న కూడా త‌లెత్త‌డం స‌హజం.

ఐతే సీనియ‌ర్ నిర్మాత‌, బాల‌య్యకు అత్యంత స‌న్నిహితుల్లో ఒక‌డైన సి.క‌ళ్యాణ్.. ఆయ‌న‌తో శంక‌రాచార్య సినిమా చేయాల‌నుకుంటున్నార‌ట‌. అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన గొప్ప‌ తత్వవేత్త , వేదాంతవేత్త అయిన శంక‌రాచార్యుల మీద సినిమా తీయాల‌న్న‌ది త‌న క‌ల అని.. ఆ పాత్ర చేయ‌డానికి బాల‌య్య‌ను మించిన ప్ర‌త్యామ్నాయం లేద‌ని సి.క‌ళ్యాణ్ అన్నారు. ప్ర‌స్తుతం బాల‌య్య క‌మిటైన మూడు చిత్రాల త‌ర్వాత ఆయ‌న‌తో ఈ సినిమా చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు క‌ళ్యాణ్ తెలిపాడు.

ఐతే ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడెవ‌ర‌నే విష‌యం వెల్ల‌డించ‌లేదు. ఐతే గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి లాంటి సినిమాల్లో అయితే హీరోయిజం ఉంటుంది, భారీ యుద్ధ సన్నివేశాలుంటాయి కాబ‌ట్టి ప్రేక్ష‌కులు ఈజీగా క‌నెక్ట్ అవుతారు కానీ.. పూర్తిగా ఆధ్యాత్మిక కోణంలో న‌డిచే శంక‌రాచార్యుల మీద సినిమా తీస్తే ఏమేర రుచిస్తుంది, క‌మ‌ర్షియ‌ల్‌గా ఇది ఏమేర వ‌ర్క‌వుట్ అవుతుంది అన్న‌దే సందేహం.