టాలీవుడ్లో మళ్లీ మాస్ సినిమాల జాతర మొదలైంది. ఇప్పటికే ‘అఖండ’ థియేటర్లలోకి దిగి వసూళ్ల మోత మోగిస్తోంది. వెండితెరల్లో ఈ స్థాయి వెలుగులు చూసి చాలా కాలం అయింది. రాబోయే రోజుల్లో మరిన్ని మాస్ మసాలా సినిమాలు సిద్ధమవుతుండటంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఇంకో పది రోజుల్లోనే ‘పుష్ప’ అనే భారీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు చూస్తున్న దానికి రెట్టింపు స్థాయిలోనే హంగామా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను తాజాగా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ‘రంగస్థలం’ తర్వాత సుకుమార్ మరోసారి గ్రామీణ నేపథ్యంలో రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ ట్రై చేసినట్లున్నాడు. కానీ సినిమా కమర్షియల్ సక్సెస్ కావడం పక్కా అనే అనిపిస్తోంది కానీ.. ‘రంగస్థలం’ లాగా ఇది మ్యాజిక్ చేస్తుందా.. కల్ట్ క్లాసిక్ స్టేటస్ తెచ్చుకుంటుందా అన్నదే సందేహంగా మారింది.
ఐతే సుకుమార్ సన్నిహితుల దగ్గర చెబుతున్న దాని ప్రకారం ‘రంగస్థలం’ లాగా ఇది క్లాసిక్ అనిపించుకోదనే అంచనా వేస్తున్నారట. అలా అనిపించుకోవాలనే కోరిక కూడా సుక్కుకు లేదని.. ఇది ఊర మాస్ స్టయిల్లో తీసిన యాక్షన్ మూవీ అని.. మాస్ ప్రేక్షకులను, బన్నీ అభిమానులను ఉర్రూతలూగించి బ్లాక్‌బస్టర్ అయితే చాలని సుకుమార్ ఆశిస్తున్నారట. ‘రంగస్థలం’ లైన్లోనే సినిమా తీసినప్పటికీ.. ఈ కథలో క్లాసిక్ అయ్యే లక్షణాలు లేవని.. కానీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో మాత్రం ఇది దానికి ఏమాత్రం తీసిపోదని సుక్కు భావిస్తున్నాడట.
ట్రైలర్ చూసిన చాలామంది ‘రంగస్థలం’లో ఉన్న క్లాస్ టచ్ లేదని.. హింస మరీ ఎక్కువైందని.. లౌడ్‌గా అనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. ఐతే సుకుమార్ లోని జీనియస్ డైరెక్టర్ బ్యాక్ సీట్ తీసుకుని పక్కా కమర్షియల్ సక్సెస్ సాధించడమే లక్ష్యంగా సినిమా తీసినట్లు కనిపిస్తోంది. బన్నీ అభిమానులకు, మాస్ ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా ఒక పండగే అన్నది చిత్ర వర్గాల సమాచారం.