థమన్ ను చూసి చాలా నేర్చుకోవాలి!

థమన్.. థమన్.. థమన్.. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ లో ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు ఇదే. ఆ హీరో అభిమానులు, ఈ హీరో అభిమానులు అని కాకుండా ఇటీవల కాలం లో తెలుగు సినిమా ప్రేక్షకులందరి ప్రేమ ని సొంతం చేసుకున్న ఏకైక సంగీత దర్శకుడు థమన్. అయితే ఇది ఓవర్ నైట్ వచ్చిన సక్సెస్ మాత్రం కానే కాదు. ‘సంగీతం’ పై దృష్టి పెట్టడం తో పాటు, ‘సినిమా’ కి సంబందించిన ఇతర అంశాల పైన కూడా అదే స్థాయి లో దృష్టి పెట్టడం థమన్ స్టార్డం అమాంతం పెరగడానికి కారణం అని చెప్పొచ్చు. ఒక విదంగా థమన్ ని చూసి నేటితరం మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా నేర్చుకోవాలి అనే కామెంట్స్ వస్తున్నాయి.

ఏ రంగం లో అయినా ఇతరుల కంటే ప్రత్యేకంగా ఏదైనా చేస్తే నే జనం మనల్ని గుర్తిస్తారు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుని ఉంటాడు థమన్. అందుకే అందరు సంగీత దర్శకుల లాగా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి ని, ఇమేజ్ ని ఏర్పరుచుకొని, ప్రతి సినిమా ని కొత్త కోణం లో చూస్తూ జనాకర్షణ ని ఇట్టే సంపాదించుకుంటున్నాడు థమన్. గత కొద్ది సంవత్సరాలు గా థమన్ ఎదుగుదల కి ముఖ్య కారణం తన సోషల్ మీడియా ప్రెజన్స్ అని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా ని థమన్ వాడుకుంటున్నట్లు గా ఇంకెవరూ వాడుకోవడం లేదు. ఈ అంశం లో మిగిలిన వారికంటే ఒక మెట్టు పైనే ఉన్నాడు థమన్.

ఒక పాట విడుదల అవుతుంది అంటే, దానికి సంబంధించి, విడుదల అయ్యే ముందు అప్డేట్స్ తో హైప్ క్రియేట్ చేయడమే కాకుండా విడుదల అయ్యాక కూడా దాని గురించి మాట్లాడుతూ సోషల్ మీడియా లో అభిమానుల తో ఇంటరాక్ట్ అవుతూ ఉండటం వలన, ఆ పాట అందరి దృష్టి ని ఇట్టే ఆకర్షిస్తుంది. అంతే కాకుండా ఈ మధ్య కాలం లో ఒక పాట లేదా ఆడియో ఆల్బమ్ విజయం లో తన సింగర్స్ కి, లిరిక్ రైటర్స్ కి, దర్శకుల కి థమన్ ఇస్తున్న క్రెడిట్ వేరెవ్వరు ఇవ్వడం లేదు. థమన్ ఆడియో కి సంబంధించి ప్రతి పాట పాడే సింగర్ ని, రాసిన లిరిక్ రైటర్ ని కూడా అభిమానులు గుర్తుపెట్టుకుంటున్నారు అంటే థమన్ వారిని ఆ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు మరి.

‘అల వైకుంఠపురంలో’ ఆడియో పెద్ద విజయం సాధించాక తన లిరిక్ రైటర్స్ తో కూర్చుని చేసిన ఇంటర్వ్యూ పెద్ద హిట్ అయింది. అంతే కాకుండా లిరిక్ వీడియోస్ లో పాడిన సింగర్స్ ని కూడా సినీ ప్రేక్షకులకి పరిచయం చేస్తుండడం థమన్ కి ఒక్కడికే చెల్లింది. ఇటీవల కాలం లో భీమ్లా నాయక్ సినిమా కి సంబందించిన రెండు పాటల్లో సింగర్స్ ని పరిచయం చేసిన తీరు అభినంచదగ్గ విషయం. సినిమా ప్రమోషన్స్ లో సైతం థమన్ తన టీమ్ కి ప్రత్యేకమైన స్థానం ఇస్తున్నారు.

ఇలా చేయడం వలన, ఆయా గాయకులు, రచయతలు లైమ్ లైట్ లో కి వస్తున్నారు. తద్వారా వారిని అభిమానందించే వాళ్ళు కూడా ఆయా పాటలు, సినిమాల పైన ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నారు. ఇదంతా చివరిగా సినిమా కి ఎంతగానో ఉపయోగపడే అంశం. ఇవాళ్టి రోజుల్లో డిజిటల్ మాధ్యమాల్లో సినిమాలు చూడటం అలవాటవుతున్న తరుణం లో కేవలం ఆడియో ఆల్బమ్ తో నే ఒక సినిమా పైన బజ్ తీసుకొని రావాలి. ఈ ప్రక్రియ లో సంగీత దర్శకుడు, అతని టీమ్ ది పెద్ద పాత్ర. థమన్ తన సోషల్ మీడియా ప్రెజెన్స్ ద్వారా, తన టీమ్ కి ఇస్తున్న క్రెడిట్ ద్వారా సినిమా పైన బజ్ అంతకంతకూ పెంచుతూ రిలీజ్ అయ్యే టైం కి సినిమా యూనిట్ లో ఒక కొత్త ఉత్సాహం నింపుతున్నాడు.

ఒకే సమయం లో అందరూ స్టార్ హీరోలకు సినిమాలు చేయడం, అందరికి హిట్ ఆల్బమ్స్ కంపోజ్ చేస్తూ అందరూ అభిమానులని కలుపుకోవడం కూడా థమన్ కి కలిసి వస్తున్న అంశం. కొందరు హీరోల అభిమానులు థమన్ ని ట్రోల్ చేసినా, ఏ మాత్రం నిరుత్సాహ పడకుండా అదే అభిమానులు తనని మెచ్చుకునేలా కేవలం పని మీద దృష్టి పెడుతూ ముందుకు సాగుతున్నాడు థమన్. కేవలం పాటల తో నే కాకుండా నేపథ్య సంగీతం తో కూడా అభిమానులని సొంతం చేసుకుంటూ ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లో నంబర్ 1 సంగీత దర్శకుడిగా థమన్ ముందుకెళ్తున్నాడు. ఇదే జోరు ని సాగిస్తూ, ఇలాగే వైవిధ్యం గా తన పంథా ని సాగిస్తూ ఉంటే, థమన్ కి తిరుగుండదు!