తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌తో టాలీవుడ్ జరిపిన చర్చలకు నందమూరి బాలకృష్ణకు పిలుపు రాలేదు. సీఎం కేసీఆర్‌తో జరిగిన భేటీకీ ఆయన వెళ్లలేదు. ఎందుకని ఆరా తీస్తే… నన్ను ఎవరూ పిలవలేదు అంటూ బాలయ్య ఫీలైపోయాడు.
అక్కడితో ఆడితే బాగుణ్ణు.. భూములు పంచుకుంటున్నారా అంటూ బాలయ్య ఆవేశ పడిపోయే సరికి.. ఈ విషయం కాస్త వివాదంగా మారింది. బాలయ్యని మీటింగులకు పిలవాల్సిందేనని కొందరు, అదేం పెళ్లి కాదు, బొట్టు పెట్టి పిలవడానికి అని మరి కొందరు… ఎవరి వాదనలు వాళ్లవి.
ఈలోగా జగన్‌తో మీటింగ్ ఖరారైంది. ఈనెల 9న టాలీవుడ్ జగన్ తో భేటీ కానుంది. కనీసం ఈ మీటింగుకైనా బాలయ్య వస్తాడేమో అనుకుంటే, రాడని తేలిపోయింది. జగన్‌తో భేటీకి బాలయ్యని ఆహ్వానించామని, కానీ మరుసటి రోజే బాలయ్య పుట్టిన రోజు ఉండడం వల్ల రావడం కుదరదని చెప్పారని ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ తేల్చేశారు. దాంతో ఈ మీటింగుకీ బాలయ్య వెళ్లడన్నమాట.
అయితే.. బాలయ్య ఆలోచనలు వేరుగా ఉన్నాయని, ఆయన జనంతో గుంపుగా వెళ్లరని, సోలోగా ఇద్దరు ముఖ్యమంత్రులతో భేటీ అవుతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. త్వరలోనే ఆయన కేసీఆర్. జగన్‌ల అప్పాయింట్‌మెంట్ తీసుకుంటారని ఆయన ఒక్కరే వ్యక్తిగతంగా కలుస్తారని తెలుస్తోంది.
కేసీఆర్ ఎన్టీఆర్‌కి పెద్ద ఫ్యాన్. ఆయన కుటుంబం అంటే కేసీఆర్‌కి గౌరవం ఉంది. జగన్ ని వ్యక్తిగతంగా కలవడం మాత్రం టీడీపీ వర్గాల్ని, అధినేత చంద్రబాబునీ ఇబ్బంది పెట్టేదే. మరి ఈ విషయంలో నందమూరి నట సింహం ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates