బ్రేకింగ్: సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరు

sirivennela
sirivennela

ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిరివెన్నెల ఈ రోజు తుదిశ్వాస విడిచారు. కిమ్స్ ఆసుపత్రిలో నిమోనియాకు చికిత్స పొందుతున్న సీతారామశాస్త్రి…కొద్ది రోజులగా వెంటిలేటర్ పై ఉన్నారు. ఆయన పరిస్థితి విషయమించడంతో మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.

సీతారామశాస్త్రి వయసు 66 సంవత్సరాలు. ఆయనకు భార్య పద్మావతి, ఇద్దరు కుమారులు యోగి, రాజా ఉన్నారు. సిరివెన్నెల మరణవార్తతో ఆయన కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయన కుటుంబ సభ్యులకు పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. సిరివెన్నెల మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సీతారామశాస్త్రి ఇంటిపేరు చేంబోలు. ‘సిరివెన్నెల’ సినిమాలో మొత్తం పాటలు బ్లాక్ బస్టర్ హిట్ లుగా మలిచిన సీతారామశాస్త్రికి అదే ఇంటిపేరుగా మారింది. 1955 మే 20న అనకాపల్లిలో జన్మించిన సిరివెన్నెల పదో తరగతి వరకు అనకాపల్లిలో చదివారు. కాకినాడలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎమ్.ఏ. చేస్తున్న సమయంలోనే ఉద్యోగంలో చేరి ‘భరణి’ కలం పేరుతో కవిత్వం రాసేవారు.  ఆ తర్వాత కళాతపస్వి కె.విశ్వనాథ్ కొత్తవారికి అవకాశం కల్పిస్తున్న క్రమంలో సీతారామశాస్త్రి టాలీవుడ్ కు పరిచయమయ్యారు.

ఆ తర్వాత ‘సిరివెన్నెల’ పాటలతో తొలి నంది అవార్డును అందుకున్న సీతారామశాస్త్రి వరుసగా మూడేళ్ళు ఉత్తమ గేయరచయితగా నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. మొత్తం 11 సార్లు ఆయన ఉత్తమ గీత రచయితగా నంది అవార్డులు సంపాదించారు. 2019లో ఆయనను కేంద్రప్రభుత్వం ‘పద్మశ్రీ’ అవార్డుతో గౌరవించింది. రాజమౌళి తాజా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్.’లో సీతారామశాస్త్రి రాసిన “దోస్తీ…” పాట ట్రెండ్ అవుతోంది.