గ్రేట్ డ్యాన్స్ మాస్ట‌ర్.. ఎనిమిదో ఏట వ‌ర‌కు ప‌డుకునే

శివశంకర్‌ మాస్టర్‌… దేశం గ‌ర్వించ‌ద‌గ్గ డ్యాన్స్ మాస్ట‌ర్ల‌లో ఒక‌డు. ఏకంగా 800కు పైగా సినిమాల‌కు నృత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఘ‌న చ‌రిత్ర ఆయ‌న‌ది. 80వ ద‌శ‌కంతో మొద‌లుపెట్టి మూడు ద‌శాబ్దాల‌కు పైగా ఆయ‌న విరామం లేకుండా డ్యాన్స్ మాస్ట‌ర్‌గా ప‌ని చేశారు. మగ‌ధీర సినిమాలో ధీర ధీర పాట‌కు ఆయ‌న జాతీయ అవార్డు అందుకోవ‌డం విశేషం. గ‌త ద‌శాబ్ద కాలంలో ఆయ‌న పెద్ద‌గా నృత్య ద‌ర్శ‌క‌త్వం చేసింది లేదు.

డ్యాన్స్ షోల‌కు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించ‌డం.. అలాగే సినిమాల్లో కొన్ని కామెడీ రోల్స్ చేయ‌డం ద్వారా బిజీగానే ఉన్నారు. ఈ మ‌ధ్య ఆయ‌న సినిమాలు, టీవీ షోల్లోనూ పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. కొన్ని రోజుల కింద‌టే కొవిడ్‌తో విష‌మ స్థితికి చేరుకున్నార‌న్న వార్త‌తో శివ‌శంక‌ర్ వార్త‌ల్లోకి వ‌చ్చారు. ఇంత‌లోనే ఆయ‌న మ‌ర‌ణ వార్త వినాల్సి వ‌చ్చింది. ఇప్పుడు ఆయ‌న గొప్ప‌ద‌నం గురించి అంద‌రూ క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకుంటున్నారు.

డ్యాన్స్ మాస్ట‌ర్‌గా 800 పైగా సినిమాల‌కు ప‌ని చేసిన శివ‌శంక‌ర్ చిన్న త‌నంలో మంచం నుంచి క‌ద‌ల్లేని స్థితిలో ఎన్నో ఏళ్లు గ‌డిపాడ‌ని తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. ఆయ‌న లేచి న‌డ‌వ‌డ‌మే క‌ష్ట‌మ‌నుకుంటే.. డ్యాన్స్ మాస్ట‌ర్ అయి వంద‌ల సినిమాల‌కు ప‌ని చేయ‌డం విడ్డూరమే. త‌మిళ‌నాడులో పుట్టిన శివ‌శంక‌ర్ ఏడాదిన్న‌ర వ‌య‌సులో ఉండ‌గా త‌మ ప్రాంతంలో ఒక ఆవు తాడు తెంచుకుని మీదికి వ‌స్తుంటే త‌ప్పించుకోబోయి కింద ప‌డ‌గా.. వెన్నెముక విరిగిపోయింద‌ట‌.

నెల రోజుల పాటు జ్వ‌రం, నొప్పితో బాధ‌ప‌డుతూ ఎన్నో ఆసుప‌త్రులు తిరిగినా ఫ‌లితం లేక‌పోయింద‌ట‌. అదే సమయంలో విదేశాల్లో డాక్టర్‌గా పనిచేసి మద్రాసు వచ్చిన నరసింహ అయ్యర్‌ అనే ఆయన వద్దకు శివశంకర్‌ను తీసుకెళ్లారట‌ ఎక్స్‌రే తీసి, వెన్నెముక విరిగిపోయిందని నిర్ధారించారయ‌న‌. అప్పుడా డాక్టర్‌ ‘ఈ పిల్లాడిని ఎవరి వద్దకు తీసుకెళ్లకుండా నా దగ్గర వదిలేస్తే లేచి నడిచేలా చేయగలను’ అని అన్నారు.

ఆయనను నమ్మి శివశంకర్‌ తండ్రి అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఆయ‌న చికిత్స అందించాక కూడా కోలుకోవ‌డానికి ఎన్నో ఏళ్లు ప‌ట్టింది. ఎనిమిదే ఏడు వ‌చ్చే వ‌ర‌కు శివ‌శంక‌ర్ అంద‌రు పిల్ల‌ల్లా లేచి తిర‌గ‌లేక‌పోయారు. ఆ త‌ర్వాత కోలుకుని లేచి తిరిగారు. చిన్న వ‌య‌సులోనే డ్యాన్స్‌పై ఆస‌క్తితో అటు వెళ్లిపోయారు. త‌ర్వాతంతా ఒక చ‌రిత్ర‌.