రజనీని చెంపదెబ్బ కొట్టలేక సినిమా వదులుకున్నాడట

సూపర్ స్టార్ రజనీ సినిమాలో హీరో తర్వాత అంత కీలకమైన పాత్ర వస్తే ఎవరైనా వద్దనుకుంటారా? కానీ మలయాళ నటుడు జయరాం వద్దనేశాడట. ఐతే అతను సినిమా వదులుకుంది పాత్ర నచ్చక కాదు. ఒక సన్నివేశం నచ్చక. అందులో ఆయనకు కనిపించిన అభ్యంతరం ఏంటంటే.. రజనీకాంత్‌ను చెంపదెబ్బ కొట్టాల్సి ఉంటుందట. అలా చేస్తే రజనీ అభిమానులు తనను ఊరికే వదిలిపెట్టరని భయపడి జయరాం ఆ సినిమాను వదులుకున్నాడట.

ఆ సినిమా మరేదో కాదు.. రజనీ కెరీర్లో అప్పటికి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘ముత్తు’. ఓ మలయాళ చిత్రం ఆధారంగా కె.ఎస్.రవికుమార్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో శరత్ బాబు పోషించిన రాజా వారి పాత్ర కోసం ముందు జయరాంనే అడిగారట. ఆయన కూడా రజనీ సినిమా అనే సరికి సంతోషంగా ఒప్పుకున్నారట.

ఐతే ఓ సన్నివేశంలో రజనీని చెంపదెబ్బ కొట్టాల్సి ఉంటుందని చెప్పారని.. ఐతే తాను ఆ పని చేయలేనని చెప్పానని.. తప్పదని అనడంతో ఆ సినిమా నుంచే తప్పుకున్నానని జయరాం చెప్పాడు. సినిమాలో అయినా సరే రజనీని చెంపదెబ్బ కొడితే అభిమానులు తట్టుకోలేరని.. వాళ్లకు భయపడే సినిమా వదులుకున్నానని జయరాం చెప్పాడు. ఈ మాటలు వింటే అతిశయోక్తిలా అనిపించొచ్చు కానీ.. తమిళనాట రజనీ అభిమానుల తీరు ఇలాగే ఉంటుంది.

‘పడయప్పా’ (నరసింహా) సినిమాలో రజనీని సవాల్ చేసే పాత్ర చేసింది రమ్యకృష్ణ. కొన్ని సన్నివేశాల్లో రజనీని అవమానిస్తుంది కూడా. ఇందుకు ఆమెపై కోపం పెంచుకుని చెన్నైలో ఒకసారి దాడికి ప్రయత్నించారు రజనీ అభిమానులు. అంతకుముందు కూడా ఇలాంటి ఉదంతాలు కొన్ని ఉన్నాయి. వాటి సంగతి తెలిసే జయరాం ‘ముత్తు’ సినిమాను వదులుకున్నట్లున్నాడు. తెలుగులో ‘భాగమతి’తో మంచి పేరు సంపాదించిన జయరాం.. ఇటీవల ‘అల వైకుంఠపురములో’లో కీలక పాత్రలో మెప్పించారు.