ప్రిప‌రేష‌న్లో బ‌న్నీ.. త‌గ్గేదే లే

Allu Arjun
Allu Arjun

ఈ రోజుల్లో హీరోల‌కు సెల్ఫ్ ప్ర‌మోష‌న్ అనేది చాలా చాలా కీల‌క‌మైన విష‌యంగా మారిపోయింది. సొంతంగా పీఆర్ టీంను పెట్టుకుని చాలా జాగ్ర‌త్త‌గా త‌మ చిత్రాల‌ను ప్ర‌మోట్ చేసుకోవ‌డ‌మే కాక‌.. వ్య‌క్తిగ‌త ఇమేజ్‌ను బిల్డ్ చేసుకోవ‌డానికి ప‌క్కా ప్లానింగ్‌తో అడుగులు వేస్తున్నారు మ‌న స్టార్ హీరోలు.

ఈ విష‌యంలో అల్లు అర్జున్ మిగ‌తా స్టార్ల‌తో పోలిస్తే రెండాకులు ఎక్కువే చ‌దివాడు. గ‌త కొన్నేళ్ల‌లో బ‌న్నీ ఇమేజ్, ఫాలోయింగ్ పెర‌గ‌డానికి అత‌డి సినిమాల స‌క్సెస్‌లకు తోడు సెల్ఫ్ ప్ర‌మోష‌న్ కూడా ఒక కార‌ణ‌మే.

వేరే హీరోల అభిమానుల్లో వ్య‌తిరేక‌త పెర‌గ‌కుండా, అంద‌రి హీరోలూ త‌నను అభిమానించేలా.. బ‌న్నీ వ్య‌వ‌హ‌రిస్తుండటం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే అత‌ను నంద‌మూరి బాల‌కృష్ణ సినిమా అఖండ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు కూడా వ‌చ్చాడు. ఇదనే కాదు.. త‌న‌కు సంబంధం లేని చాలా సినిమాల ఈవెంట్ల‌లో బ‌న్నీ పాల్గొన‌డం గ‌మ‌నించ‌వ‌చ్చు.

ఏ ఈవెంట్‌కు వ‌చ్చినా స్పీచ్ విష‌యంలో బాగా ప్రిపేరై వ‌స్తాడు బ‌న్నీ. అఖండ ఈవెంట్ విష‌యంలోనూ అత‌నెంత ప్రిపేర‌య్యాడో స్పీచ్ గ‌మ‌నించిన వాళ్ల‌కు బాగానే అర్థ‌మైంది. మ‌ధ్య‌లో అభిమానులు అత‌డి స్పీచ్ అయిపోయింద‌నుకుని జై బాల‌య్య నినాదాలు చేస్తుంటే.. అప్పుడే అయిపోలేదు, ఇంకా చాలా ఉంద‌ని బ‌న్నీ చెప్ప‌డం విశేషం.

బాల‌య్య‌కు సినిమాలంటే ఎడిక్ష‌న్ అని.. ఆయ‌న స్పెషాలిటీనే డిక్ష‌న్ అని.. రైమింగ్ క‌లిసొచ్చేలా బ‌న్నీ చెప్పిన మాట‌.. అత‌డి ప్రిప‌రేష‌న్లో భాగ‌మే అన్న‌ది స్ప‌ష్టం. అలాగే స్పీచ్ చివ‌ర్లో కొవిడొచ్చినా.. ఆ దేవుడే దిగివ‌చ్చినా.. తెలుగు ప్రేక్ష‌కులు త‌గ్గేదే లే అంటూ బ‌న్నీ చెప్పిన మ‌రో రైమింగ్ డైలాగ్ కూడా బ‌న్నీ ఇలాంటి ఈవెంట్ల‌కు ఎంత‌గా ప్రిపేరై వ‌స్తాడో చెప్ప‌డానికి ఉదాహ‌ర‌ణ‌. చివ‌ర‌గా జై బాల‌య్య నినాదం చేయ‌డం ద్వారా బాల‌య్య అభిమానుల మ‌న‌సు దోచేసి వాళ్ల ద‌గ్గ‌ర మంచి మార్కులు కొట్టేశాడు అల్లు హీరో.