టాలీవుడ్ లో మరో విషాదం జరిగింది. ప్రముఖ సినీ దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు హఠాన్మరణం టాలీవుడ్ తో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలను షాక్ కు గురి చేసింది. ఫిట్స్ తో నాగేశ్వరరావు మరణించారు. తన సొంత ఊరు నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమవుతుండగా కోదాడ సమీపంలో ఆయనకు ఫిట్స్ వచ్చాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు నాగేశ్వరరావును హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ఆ తర్వాత మెరుగైన వైైద్యం కోసం మరో రెండు, మూడు ఆసుపత్రులకు తరలించారు. చివరకు ఏలూరు ఆసుపత్రిలో నాగేశ్వరరావును చేర్పించినప్పటికీ పరిస్థితి చేయిదాటిపోయింది. నాగేశ్వరరావు మృతితో టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురయింది. నాగేశ్వరరావు మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నాగేశ్వరరావు కుటుంబానికి తమ సానుభూతిని తెలుపుతున్నారు. కేఎస్ నాగేశ్వరరావు పార్థివదేహాన్ని ఆయన అత్తగారి ఊరైన నల్లజర్ల సమీపంలోని కౌలూరులో ఉంచారు. ఆ ఊరిలోనే నాగేశ్వరరావు అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ దగ్గర నాగేశ్వరరావు అసిస్టెంట్ గా కెరీర్ ప్రారంభించారు. ‘రిక్షా రుద్రయ్య’ తో దర్శకుడిగా మారిన నాగేశ్వరరావు….దివంగత శ్రీహరిని హీరోగా పరిచయం చేస్తూ ‘పోలీస్’ సినిమాకు తొలిసారి దర్శకత్వం వహించారు. తాజాగా తన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావుతో కలిసి ఒక సినిమా తీయాన్న యోచనలో ఉన్నారు. ఈ లోపే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates