‘బ్రహ్మాస్త్ర’.. ఐదేళ్లు ఏం తీశారబ్బా!

అద్భుతమైన టెక్నికల్ వేల్యూస్‌తో, భారీ వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్‌తో కూడిన సినిమాలను కూడా కొన్ని నెలల్లో తీసేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. అయినా కానీ బాలీవుడ్‌లో ఓ సినిమా నాలుగేళ్లుగా తెరకెక్కుతోంది. వచ్చే యేడు కానీ ప్రేక్షకుల ముందుకు రావడం కుదరదంటోంది. అసలు అప్పుడైనా వస్తుందో రాదోననే డౌట్‌ అందరినీ వెంటాడుతోంది. ఆ సినిమాయే.. బ్రహ్మాస్త్ర.

రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ ప్యాన్ ఇండియా చిత్రం తెలుగువారికి కూడా ప్రత్యేకమే. ఎందుకంటే చాలాకాలం తర్వాత నాగార్జున నటిస్తున్న హిందీ చిత్రమిది. అజయ్ వశిష్ఠ్ అనే ఆర్కియాలజిస్ట్ పాత్రలో ఆయన కనిపించనున్నారు. అందుకే తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ వెయిటింగ్ వయసు ఇప్పటికి నాలుగేళ్లు.

2017 అక్టోబర్‌‌లో ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు కరణ్. అది కూడా ఒక సినిమా కాదు. ట్రయాలజీగా తీసుకు రానున్నట్టు చెప్పాడు. మొదటి పార్ట్ షూటింగ్‌ 2018 జనవరిలో మొదలైంది. అప్పటి నుంచి జరుగుతూనే ఉంది. పోనీ కరోనా వల్ల ఓ అర్ధ సంవత్సరమో, మరీ కాదంటే ఓ సంవత్సరం పోయిందనుకున్నా.. ఒక సినిమా తీయడానికి ఇది చాలా ఎక్కువ కాలం కిందే లెక్క. 2019 ఆగస్ట్‌లో రిలీజ్ చేస్తామని మొదటే ప్రకటించినా.. అప్పటికి సినిమా పావువంతు కూడా పూర్తి కాలేదు. దాంతో వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కొత్త డేట్‌కి ఫిక్సయ్యారు. వచ్చే యేడు సెప్టెంబర్‌‌ 9న రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

అంటే ఐదేళ్లకి బ్రహ్మాస్త్ర బైటికొస్తోందన్నమాట. ఇదొక సూపర్‌‌ హీరో ఫిల్మ్. సూపర్‌‌ నేచురల్ ఫార్మాట్‌లో ఉండే రొమాంటిక్ ఫెయిరీ టేల్. అయాన్‌ ముఖర్జీ ఈ సినిమా స్క్రిప్ట్ మీద ఆరేళ్లు కూర్చున్నాడట. మూడు పార్ట్స్‌ తీయడానికి పదేళ్లు పట్టొచ్చని ముందే ఫిక్సయ్యాడట. కానీ మొదటి భాగానికే ఇన్నేళ్లు పట్టింది. మరి మిగతా రెండు పార్ట్స్‌ ఎప్పటికి వస్తాయో దేవుడికెరుక.