ఆ సినిమాకు దర్శకుడెందుకు మారాడు?

‘కల్కి’ తర్వాత రాజశేఖర్ కెరీర్లో అనుకోకుండా గ్యాప్ వచ్చింది. ఏ సినిమా చేయాలో ఎంచుకోవాలనే విషయంలో కన్ఫ్యూజన్‌తో ఆయన దాదాపు ఏడాదికి పైగానే ఖాళీగా ఉండిపోయాడు. వీరభద్రం చౌదరితో ఓ సినిమా అనుకుని దాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయాడు. ‘కపటధారి’ సినిమాను ఓకే చేసి దాన్నుంచి తప్పుకున్నాడు.

తర్వాత మలయాళ మూవీ ‘జోసెఫ్’ను రీమేక్ చేయడానికి ఆయన రెడీ అవడం.. ‘శేఖర్’ పేరుతో ఈ సినిమాను ప్రకటించడం తెలిసిందే. ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశాక రాజశేఖర్ కరోనా బారిన పడటంతో కొన్ని నెలల పాటు ఈ సినిమా హోల్ట్‌లో ఉంది. తర్వాత ఇది సెట్స్ మీదికి వెళ్లింది. ఇప్పుడు ఫస్ట్ టీజర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ‘శేఖర్’ మూవీ. ఐతే ఇందులో డైరెక్టర్ పేరు చూసి అంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ చిత్రానికి ముందు ప్రకటించిన దర్శకుడి పేరు లలిత్. ఫస్ట్ లుక్‌లో ఆ పేరే ఉంది.

కానీ ఇప్పుడు టీజర్ రిలీజయ్యే టైంకి డైరెక్టర్ మారిపోయారు. రాజశేఖర్ సతీమణి జీవిత రాజశేఖరే ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నట్లు వెల్లడైంది. మరి మధ్యలో ఏం జరిగింది.. దర్శకుడిగా లలిత్ స్థానంలోకి జీవిత ఎందుకు వచ్చింది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇలా తన భర్త సినిమాల విషయంలో జీవిత మధ్యలో ఛార్జ్ తీసుకోవడం కొత్తేమీ కాదు. ‘ఎవడైతే నాకేంటి’ సినిమా విషయంలోనూ ఇలాగే జరిగింది. బేసిగ్గా ఆ చిత్రానికి దర్శకుడు సముద్ర అయినప్పటికీ.. మధ్యలో ఆ బాధ్యతలు జీవిత తీసుకున్నారు.

ఇదే కాక రాజశేఖర్ హీరోగా ఆమె శేషు, ఎవడైతే నాకేంటి, ఆప్తుడు, మహంకాళి చిత్రాలను కూడా తెరకెక్కించారు. ఇందులో దాదాపుగా అన్నీ రీమేక్‌లే. ‘శేఖర్’ సైతం రీమేకే కావడంతో జీవితకు పెద్దగా ఇబ్బంది లేనట్లే కనిపిస్తోంది. ఈ సినిమా కోసం కెరీర్లో తొలిసారిగా పూర్తిగా తెల్లటి గడ్డంతో డిఫరెంట్ లుక్‌‌లోకి మారాడు రాజశేఖర్. ఒరిజినల్ మెడికల్ మాఫియా చుట్టూ తిరిగే మంచి కంటెంట్ ఉన్న థ్రిల్లర్ మూవీ కావడంతో తెలుగులోనూ ఇది వర్కవుట్ అయ్యే అవకాశాలున్నాయి.