అనసూయ కోలీవుడ్ ఎంట్రీ

అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌ను మొద‌ట్లో జ‌బ‌ర్ద‌స్త్ షోలో చూసి ఏమో అనుకున్నారు కానీ.. ఆ షోతో తెలుగులో యాంక‌రింగ్ తీరునే మార్చేసి, ఆ త‌ర్వాత సినిమాల్లోనూ త‌న‌దైన ముద్ర వేసిందామె. క్ష‌ణంతో మొద‌లుపెట్టి రంగ‌స్థ‌లం వ‌ర‌కు చాలా సినిమాల్లో ఆమె న‌టిగా త‌నేంటో రుజువు చేసింది. థ్యాంక్ యు బ్ర‌ద‌ర్ అనే సినిమాలో లీడ్ రోల్ కూడా చేసిన అన‌సూయ‌.. ఇప్పుడు పుష్ప స‌హా కొన్ని క్రేజీ చిత్రాల్లో న‌టిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌లో ఓ వెరైటీ సినిమాను అనౌన్స్ చేశారు. ఇందులో డ్యాన్స్ కొరియోగ్రాఫ‌ర్, న‌టుడు, ద‌ర్శ‌కుడు ప్ర‌భుదేవా లీడ్ రోల్ చేస్తుండ‌టం విశేషం. ఆయ‌న‌తో పాటు రెజీనా క‌సాండ్రా, అన‌సూయ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఆ చిత్రానికి ఫ్లాష్ బ్యాక్ అనే టైటిల్ పెట్ట‌డం విశేషం.

‘ఫ్లాష్ బ్యాక్’ మూవీని డాన్ శాండీ అనే దర్శకుడు రూపొందిస్తున్నాడు. ‘అభిషేక్ ఫిలిమ్స్’ బేనర్ మీద రమేష్ పిళ్లై నిర్మిస్తున్నాడు. సామ్ సీఎస్ సంగీత దర్శకుడు. ఈ పేర్లన్నీ చూస్తేనే ఇది తమిళ చిత్రం అని అర్థమైపోతుంది. బేసిగ్గా తమిళంలో తీసి తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తుండొచ్చు. తమిళ వెర్షన్ వరకు పోస్టర్ మీద అనసూయ లేదు. ఆమెకు అక్కడ అంతగా గుర్తింపు లేకపోవడం వల్ల తన పేరు పోస్టర్ మీదికి ఎక్కలేదేమో. తెలుగు వెర్షన్ పోస్టర్లలో ఆమె పేరును జోడించారు.

దర్శకత్వంలో బిజీగా ఉండటంతో చాలా ఏళ్లు నటనకు దూరంగా ఉన్నాడు ప్రభుదేవా. కానీ ఈ మధ్య మళ్లీ నటుడిగా బిజీ అవతున్నారు. ‘భగీరా’ సహా తమిళంలో రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు. అందులో ‘ఫ్లాష్ బ్యాక్’ కూడా ఒకటి. ఈ చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న అనసూయకు అక్కడ ఎలాంటి ఆరంభం లభిస్తుందో చూడాలి.