అలాంటి సినిమాలు చేయాలని అడుక్కున్న హీరో

Shahid Kapoor
Shahid Kapoor

షాహిద్ కపూర్.. బాలీవుడ్లో దాదాపు రెండు దశాబ్దాల నుంచి హీరోగా కొనసాగుతున్నాడు. కానీ ఎప్పుడూ ఒక స్థాయికి మించి ఎదగలేకపోయాడు. అడపా దడపా హిట్లు కొడుతున్నా చాలామంది స్టార్ హీరోల మాదిరి ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించడంలో అతను విఫలమయ్యాడు. నిన్నా మొన్నా వచ్చిన టైగర్ ష్రాఫ్ లాంటి యంగ్ హీరోల సినిమాలు వసూళ్ల మోత మోగిస్తుంటే షాహిద్ కపూర్ ఒక పరిధి దాటి ఎదగకపోవడం తన అభిమానులకు ఇబ్బందిగానే అనిపించింది.

ఐతే ‘కబీర్ సింగ్’ మూవీతో షాహిద్ రాత మారిపోయింది. అతను కూడా వందల కోట్ల వసూళ్లు రాబట్టే హీరో అయ్యాడు. ‘అర్జున్ రెడ్డి’కి రీమేక్‌గా వచ్చిన ఆ చిత్రం 2019లో విడుదలై ఫుల్ రన్లో రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టడం విశేషం. దీంతో అతడి కరువంతా తీరిపోయింది. దీని తర్వాత షాహిద్ నుంచి రానున్న మరో తెలుగు రీమేక్ మూవీ ‘జెర్సీ’ మీదా భారీగానే అంచనాలున్నాయి. ఇది కూడా ‘కబీర్ సింగ్’ తరహాలోనే వసూళ్ల మోత మోగిస్తుందని భావిస్తున్నారు.

కాగా ‘కబీర్ సింగ్’ చేయడానికి ముందు తన పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండేదని.. మిగతా హీరోల చిత్రాల్లా తన సినిమాలు భారీ వసూళ్లు సాధించడం లేదేంటని బాధ పడేవాడినని ‘జెర్సీ’ ట్రైలర్ లాంచ్ సందర్భంగా షాహిద్ గుర్తు చేసుకున్నాడు. 200-250 కోట్ల వసూళ్లు తెచ్చిన సినిమాలను రూపొందించిన దర్శకులు, నిర్మాతల దగ్గరికెళ్లి తనతోనూ అలాంటి సినిమాలు తీయాలని తాను అడుక్కుున్నట్లు షాహిద్ వెల్లడించడం విశేషం. ఐతే వాళ్లెవ్వరూ తనతో సినిమా తీయకపోయినా సందీప్ రెడ్డి ‘కబీర్ సింగ్’ మూవీతో తన కోరిక నెరవేర్చినట్లు చెప్పాడు.

ఇక ‘జెర్సీ’ గురించి మాట్లాడుతూ.. ‘కబీర్ సింగ్’ విడుదలకు ముందే తనను గౌతమ్ ఈ కథతో సంప్రదించాడని, కానీ అప్పుడు అతడికి నో చెప్పానని.. కానీ తన కోసం వెయిట్ చేసి చివరికి ఈ సినిమా తీశాడని షాహిద్ వెల్లడించాడు. ‘జెర్సీ’ ఒరిజినల్ చూసినపుడు తాను ఎంత ఏడ్చానో తనకే తెలియదని షాహిద్ చెప్పడం విశేషం.