ఎన్టీఆర్-కొరటాల.. రివెంజ్ డ్రామా

NTR

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ ఎంత మంచి మిత్రులో అందరికీ తెలిసిందే. కొరటాల రచయితగా ఉన్నప్పటి నుంచి ఆయనకు తారక్‌తో మంచి అనుబంధం ఉంది. కొరటాలకు రచయితగా అవకాశం ఇచ్చిందే తారక్. ‘బృందావనం’కు మాటలు రాయడం ద్వారా అతను వెలుగులోకి వచ్చాడు. దర్శకుడిగా కొరటాల తొలి చిత్రం ఎన్టీఆర్‌తోనే చేయాల్సింది కానీ.. కుదర్లేదు.

తర్వాత వీళ్లిద్దరూ కలిసి ‘జనతా గ్యారేజ్’ చేశారు. అది బ్లాక్‌బస్టర్ అయింది. మళ్లీ ఈ కలయికలో ఓ సినిమాను కొన్ని నెలల కిందటే ప్రకటించడం తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తారక్ చేయబోయే చిత్రమిదే. ఐతే ‘ఆర్ఆర్ఆర్’తో పాటు.. కొరటాల చేస్తున్న ‘ఆచార్య’ కూడా ఆలస్యం కావడంతో వీరి కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కడం లేటైంది. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందనే విషయంలో రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. వాటికి తారక్ ఫుల్ స్టాప్ పెట్టేశాడు.

ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఎన్టీఆర్.. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడాడు. అందులో ముందుగా కొరటాల చిత్రం గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా 2022 ఫిబ్రవరిలో సెట్స్ మీదికి వెళ్లుంది. ఇది ఒక రివెంజ్ డ్రామా. ఆరేడు నెలల్లో సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నాం’’ అని తారక్ చెప్పాడు.

ప్రస్తుతం తారక్ యూరప్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ తాలూకు అలసట తీర్చుకోవడానికి తారక్ రెండు నెలల విశ్రాంతి తీసుకోనున్నాడు. మరోవైపు కొరటాల ‘ఆచార్య’ పని పూర్తి చేసి తారక్‌తో చేయబోయే సినిమా స్క్రిప్టుకు తుది మెరుగులు దిద్దుకుంటున్నాడు.

ఫిబ్రవరిలో ‘ఆచార్య’ రిలీజయ్యాక ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుందన్నమాట. మరోవైపు ప్రశాంత్ నీల్ సినిమా గురించి తారక్ మాట్లాడుతూ.. ఈ చిత్రం 2022 అక్టోబరులో మొదలవుతుందని, కేజీఎఫ్ రేంజ్‌లోనే ఉంటుందని తారక్ చెప్పడం విశేషం.