మరో యంగ్ డైరెక్టర్ తో మెగాస్టార్!

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ అనే సినిమాలో నటిస్తోన్న మెగాస్టార్ మరో రెండు సినిమాలను ఒప్పుకున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఓ సినిమా, అలానే యంగ్ డైరెక్టర్ బాబీతో మరో సినిమా చేయబోతున్నారు. ఇప్పుడు మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చాలా మంది దర్శకులు మెగాస్టార్ కి కథలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు వెంకీ కుడుముల కూడా చిరుకి కథ చెప్పారట.

ఆ కథ చిరుకి నచ్చడంతో సినిమా చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. గతంలో వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ‘ఛలో’, ‘భీష్మ’ లాంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ‘భీష్మ’ తరువాత వెంకీ చాలా మంది హీరోలకు కథలు నేరేట్ చేశారు. ఫైనల్ గా మెగాస్టార్ చిరుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించబోతున్నారని తెలుస్తోంది.

‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ సమయంలో డీవీవీ దానయ్య.. మెగాస్టార్ ని కలిసి ఆయనతో సినిమా చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇంతకాలం డైరెక్టర్ దొరక్క ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయలేదు. ఎట్టకేలకు వెంకీ కుడుముల చెప్పిన కథ చిరుకి నచ్చడంతో ప్రాజెక్ట్ ఫైనల్ అయింది. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారు. తను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసిన తరువాత చిరు.. ఈ ప్రాజెక్ట్ ను మొదలుపెడతారు.