బంటీ ఔర్ బబ్లీ.. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి. అభిషేక్ బచ్చన్-రాణి ముఖర్జీ జంటగా, అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను షాద్ అలీ రూపొందించగా.. అగ్ర నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మించాడు. 2005లో విడుదలైన ఈ సినిమా ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. దీన్ని తెలుగులో తరుణ్, ఇలియా, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో ‘భలే దొంగలు’ పేరుతో రీమేక్ చేయగా.. ఇక్కడ మాత్రం సరిగా ఆడలేదు.
బాలీవుడ్లో ‘బంటీ ఔర్ బబ్లీ’కి సీక్వెల్ తీయాలన్న ప్రయత్నం ఎప్పట్నుంచో జరుగుతోంది. ఎట్టకేలకు మాతృక వచ్చిన దశాబ్దంన్నరకు ‘బంటీ ఔర్ బబ్లీ-2’ పట్టాలెక్కింది. ఐతే ముందు అభిషేక్-రాణిలతోనే ఈ సినిమా తీయాలనుకున్నారు కానీ.. జూనియర్ బచ్చన్‌తో ఏవో విభేదాలు వచ్చి అతణ్ని ఈ సినిమా నుంచి తప్పించాడు నిర్మాత ఆదిత్య చోప్రా. అతడి స్థానంలోకి సైఫ్ అలీ ఖాన్ వచ్చాడు. అభిషేక్ లేకుండా ‘బంటీ ఔర్ బబ్లీ’ తీస్తుండటంపై చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. అభిషేక్ ఫ్యాన్స్ ఆదిత్యను తిట్టిపోశారు కూడా.
కానీ ఇప్పుడు ‘బంటీ ఔర్ బబ్లీ-2’కు వస్తున్న స్పందన చూశాక అభిషేక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అభిషేక్ అయితే మరింత ఆనందపడుతూ ఉంటానడంలో సందేహం లేదు. ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి డిజాస్టర్ టాక్ వచ్చింది.
తొలి రెండు రోజుల్లో ఈ సినిమా రూ.5 కోట్ల వసూళ్లకు పరిమితం అయింది. ఆదివారం కూడా పెద్దగా పుంజుకునే అవకాశం కనిపించడం లేదు. వీకెండ్ తర్వాత సినిమా పనైపోయినట్లే. బాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా బంటీ ఔర్ బబ్లీ నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. అభిషేక్ స్థానంలోకి వచ్చిన సైఫ్ అలీ ఖాన్ అప్పుడు తనకిది మంచి ఛాన్స్ అనుకున్నాడు కానీ.. తానెందుకు ఈ సినిమా చేశానా అని ఫీలయ్యే పరిస్థితి తలెత్తిందిప్పుడు.