టైమింగ్ కలిసొచ్చి ఆడేసింది కానీ..

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. గత నెలలో దసరా కానుకగా విడుదలైన కొత్త సినిమా. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ రూపొందించిన చిత్రమిది. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ‘గీతా ఆర్ట్స్-2’ బేనర్ మీద బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించాడు. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రానికి మంచి ఫలితమే దక్కింది. రూ.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందీ సినిమా.

ఈ రోజుల్లో చాలా మంచి టాక్ వస్తే తప్ప థియేటర్లలో ఇలాంటి వసూళ్లు రాబట్టడం అంత తేలిక కాదు. అందులోనూ హీరోగా నటించిన మూడు చిత్రాలతోనూ డిజాస్టర్లు చవిచూసిన అఖిల్‌ను హీరోగా పెట్టి.. అస్సలు ఫాంలో లేని భాస్కర్ తీసిన సినిమాకు ఇలాంటి ఫలితం దక్కడం ఆశ్చర్యమే. థియేటర్లలో ఈ సినిమా చూడలేకపోయిన వాళ్లందరూ.. ఓటీటీ రిలీజ్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు. ఈ శుక్రవారమే ఆహాలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ స్ట్రీమింగ్ మొదలైంది.

ఐతే ఓటీటీలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చూసిన వాళ్లంతా నెగెటివ్‌గా స్పందిస్తున్నారు. ఈ సినిమా థియేటర్లలో అంత బాగా ఎలా ఆడేసిందంటూ ఆశ్చర్యపోతున్నారు. సినిమా మరీ సోదిగా ఉందన్న కామెంట్లే కనిపిస్తున్నాయి సోషల్ మీడియా అంతటా. అందరూ ముక్తకంఠంతో చెబుతున్న మాటేంటంటే.. పూజా హెగ్డేను మినహాయిస్తే సినిమాలో పెద్దగా ఆకర్షణలు లేవని. అఖిల్ విషయంలో నెగెటివ్ ట్వీట్లే పడుతున్నాయి నెటిజన్ల నుంచి. సినిమాలో సెకండాఫ్ విషయంలో పూర్తి ప్రతికూలంగా స్పందిస్తున్నారు.

నిజానికి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ థియేటర్లలో రిలీజైనపుడు కూడా ఫుల్ పాజిటివ్ టాక్ ఏమీ రాలేదు. మిక్స్‌డ్ రివ్యూలే వచ్చాయి. ప్రేక్షకుల ఫీడ్ బ్యాక్ కూడా అలాగే ఉంది. కానీ దసరా టైంలో ఏదో ఒక సినిమా చూడాలనుకున్న వాళ్లకు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ను మించిన ఛాయిస్ లేకపోయింది. ‘మహాసముద్రం’ డిజాస్టర్ టాక్‌తో మొదలవడం, ‘పెళ్ళిసందడి’లో పాటలు మినహా విషయం లేకపోవడం ఈ చిత్రానికి బాగా కలిసొచ్చి మంచి వసూళ్లు వచ్చాయి.