కావాలనే టార్గెట్ చేశారని.. స్టేజ్ పై ఏడ్చేసిన హీరో!

ప్రముఖ కోలీవుడ్ హీరో శింబు కొందరు కావాలని తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. వెంకటేష్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా నటించిన ‘మానాడు’ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. ఓ ఈవెంట్ లో శింబు మాట్లాడుతూ ఎమోషనల్ అయి ఏడ్చేశారు. ఈ సినిమా కోసం ఎంతో శ్రమించానని చెప్పారు. వెంకటేష్ ప్రభుతో చాలా రోజులుగా సినిమా చేయాలనుకున్నానని.. కానీ కొన్ని కారణాల వలన ఆలస్యమైందని చెప్పారు.

ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కి కొదవ ఉందని.. ఈ సినిమాతో తన రేంజ్ మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటివరకు సినిమా గురించి సరదాగా మాట్లాడిన శింబు ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటూ తనను కొందరు కావాలనే టార్గెట్ చేశారని.. ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ఆయన ఏడవడంతో వెంటనే పక్కన ఉన్న క్రూ మెంబర్స్ ఓదార్చే ప్రయత్నం చేశారు. కాసేపటికి తేరుకొని.. ఆ సమస్యల సంగతి తాను చూసుకుంటానని.. తన సంగతి మాత్రం అభిమానులు చూసుకోవాలని కోరారు.

ఈ మధ్యకాలంలో శింబుకి ఒక్క హిట్టు కూడా పడలేదు. సినిమాల్లేక ఇబ్బంది పడ్డారు. పెర్సనల్, ప్రొఫెషనల్ జీవితాలకు సంబంధించి పలు వివాదాల్లో శింబు పేరు వినిపించింది. ఇండస్ట్రీలో కూడా కొందరితో గొడవ పడడం, టైంకి షూటింగ్ కి రాకపోవడంతో వంటి కారణాలతో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆయనపై ఫైర్ అవుతూ.. కొంతకాలంపాటు నిషేధించింది. ఫైనల్ గా అన్ని స్ట్రగుల్స్ ను దాటుకొని తన కొత్త సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు ఈ హీరో.