అమ్మానాన్నలకు డేట్లిచ్చిన కీర్తి

కీర్తి సురేష్ కెరీర్లో తొలి మూణ్నాలుగేళ్లు ఏమంత ఎగ్జైటింగ్‌గా సాగలేదు. మలయాళం, తమిళం, తెలుగులో ఆమె మామూలు సినిమాలే చేసింది. తెలుగులో ఆమె ఫస్ట్ రిలీజ్ ‘నేను శైలజ’ హిట్టయినా సరే.. నటిగా తనకు అంత మంచి పేరేమీ రాలేదు. ఆమె ఇక్కడ చేసిన తొలి సినిమా ‘ఐనా ఇష్టం నువ్వు’ అసలు విడుదదలకే నోచుకోలేదు.

‘నేను శైలజ’ తర్వాత ‘నేను లోకల్’ సూపర్ హిట్ కాగా.. అప్పటికి కూడా ఆమె మామూలు హీరోయిన్‌గానే కనిపించింది. కానీ మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’తో ఆమె కెరీర్ అనూహ్యమైన మలుపు తిరిగింది. ఈ సినిమాలో లీడ్ రోల్‌కు కీర్తిని ఎంచుకున్నపుడు విమర్శలు గుప్పించిన వాళ్లందరూ అందులో తన అభినయం చూసి నోరెళ్లబెట్టారు. కీర్తి ఇంత మంచి నటా అనుకున్నారు. ఆమె అభినయానికి జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం కూడా దక్కించుకుంది.

‘మహానటి’ తర్వాత కీర్తి స్థాయే మారిపోయింది. వివిధ భాషల్లో ఆమె భారీ చిత్రాలు చేస్తోంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఆమె హవా సాగిస్తోంది. ఇప్పుడామె కొత్తగా మలయాళ:లో ‘వాషి’ అనే సినిమాను మొదలుపెట్టింది. ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకం. ఇది కీర్తి సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న చిత్రం.

ఐతే ఈ నిర్మాణ సంస్థ కొత్తదేమీ కాదు. అది కీర్తి మొదలుపెట్టింది కాదు. కీర్తి నాన్న సురేష్ మలయాళంలో పేరు మోసిన నిర్మాతే. 80, 90 దశకాల్లో పెద్ద ఎత్తున సినిమాలు నిర్మించారు. ముందు వేరే నిర్మాతతో కలిసి సినిమాలు తీసిన ఆయన.. నటి మేనకను పెళ్లాడాక ‘రేవతి కళామందిర్’ పేరుతో కొత్త నిర్మాణ సంస్థ పెట్టి సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. కెరీర్ ఆరంభంలో కీర్తి ఈ బేనర్లో ‘పైలట్స్’ అనే సినిమా చేసింది. కానీ తను స్టార్ అయ్యాక మాత్రం సొంత నిర్మాణ సంస్థలో సినిమా చేయలేదు. ఎట్టకేలకు తన అమ్మానాన్నలకు డేట్లిచ్చి ‘వాషి’ అనే సినిమా చేయబోతోంది. టొవినో థామస్ ఇందులో హీరో. విష్ణురాఘవ్ డైరెక్ట్ చేస్తున్నాడు.