వ‌రుణ్ తేజ్ స్థానంలో కీర్తి సురేష్‌

ఒక‌ప్పుడు ఒక సినిమాకు ఒక రిలీజ్ డేట్ ఇచ్చారంటే ప‌క్కాగా ఆ డేట్‌కు సినిమాను దించేసేవాళ్లు. ప్లానింగ్‌లో తేడా వ‌చ్చేది కాదు. ఏవో కొన్ని సినిమాల‌కు మాత్ర‌మే స‌మ‌యానికి వ‌ర్క్ పూర్తి కాక‌, ఇంకేదో కార‌ణంతో డేట్ మార్చాల్సి వ‌చ్చేది. సినిమాను వాయిదా వేయ‌డానికి, రిలీజ్ డేట్ మార్చ‌డానికి చాలా ఇబ్బంది ప‌డిపోయేవారు. అభిమానులు కూడా ఇలా డేట్లు మారిస్తే నిరాశ చెందేవాళ్లు. కానీ క‌రోనా పుణ్య‌మా అని లెక్క‌ల‌న్నీ మారిపోయాయి.

ఒక డేట్ ఇవ్వ‌డం.. త‌ర్వాత సినిమాను వాయిదా వేయ‌డం.. ఇంకోసారి కూడా డేట్ మార్చ‌డం.. ఇలాంటి అనుభ‌వాలు చాలా సినిమాల విష‌యంలో చూశాం. అంత‌టి అనిశ్చిత వాతావ‌ర‌ణాన్ని తీసుకొచ్చింది కరోనా మ‌హ‌మ్మారి. క‌రోనా ప్ర‌భావం త‌గ్గాక కూడా వేరే కార‌ణాల‌తో డేట్లు మార్చ‌డం జ‌రుగుతూనే ఉంది. పెద్ద పెద్ద సినిమ‌ల విష‌యంలోనూ ఈ ప‌రిస్థితి చూస్తున్నాం. ఇక చిన్న సినిమాల సంగ‌తి చెప్పేదేముంది?

కీర్తి సురేష్ న‌టించిన గుడ్ ల‌క్ స‌ఖి సైతం ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదా ప‌డింది. కొన్ని నెల‌ల పాటు అస‌లు వార్త‌ల్లోనే లేని ఆ చిత్రం ఈ మ‌ధ్యే రిలీజ్ డేట్ ప్ర‌క‌ట‌న‌తో జ‌నాల నోళ్ల‌లో కాస్త నానింది. ఈ చిత్రాన్ని న‌వంబ‌రు 26న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు కొన్ని రోజుల కింద‌టే ప్ర‌క‌టించారు. కానీ డేట్ ద‌గ్గ‌ర‌ప‌డ్డా ప్ర‌మోష‌న్లు చేయ‌ని చిత్ర బృందం.. ఇప్పుడు వాయిదా వార్త‌తో మీడియాలోకి వ‌చ్చింది.

టైమింగ్, థియేట‌ర్ల స‌మ‌స్య‌, ఇత‌ర కార‌ణాల వ‌ల్ల ఈ సినిమాను న‌వంబ‌రు 26 నుంచి డిసెంబ‌రు 10కి వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. నిజానికి ఆ డేట్‌కు వ‌రుణ్ తేజ్ మూవీ గ‌ని రావాల్సింది. కానీ ఆ చిత్రాన్ని డిసెంబ‌రు 24కు వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వాళ్లిలా డేట్ మార్చుకున్నారో లేదో గుడ్ ల‌క్ స‌ఖిని డిసెంబ‌రు 10కి ఫిక్స్ చేస్తూ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. మ‌రి ఆ డేట్‌కైనా సినిమా వ‌స్తుందో లేదో చూడాలి.