కోవిడ్ ప్రముఖుల్ని కూడా వదలిపెట్టటం లేదు. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా..రాజు పేద అన్న భేదభావం అస్సలు లేని ఈ మహమ్మారి పంజాకు పలువురు బలి అవుతున్నారు. వీరిలో సామాన్యులేకాదు.. ప్రముఖులు ఉంటున్నారు.
ఇప్పటికే వైరస్ కారణంగా బాలీవుడ్ కు చెందిన పలువురు బలయ్యారు. తాజాగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ వాజిద్ ఖాన్ మరణాన్ని జీర్ణించుకోలేని బాలీవుడ్ కు మరో సినీ ప్రముఖుడి మరణం షాకింగ్ గా మారింది.
అంతే కాదు.. రోటీన్ కు భిన్నంగా ఈ మరణానికి సంబంధించిన సమాచారం అంత్యక్రియలు ముగిసిన కొన్ని గంటల తర్వాత బయట ప్రపంచానికి తెలీటం గమనార్హం. బాలీవుడ్ నిర్మాతగా సుపరిచితుడైన 77 ఏళ్ల అనిల్ సూరి తాజాగా కన్నుమూశారు.
తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన్నుఒక ఆసుపత్రికి తీసుకెళితే.. అక్కడ చేర్చుకోవటానికి నో అనటంతో మరో ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. కరోనాతో బాధ పడుతున్న ఆయనకు చికిత్స చేయించేందుకు ప్రముఖ ఆసుపత్రులైన లీలావతి.. హిందుజా ఆసుపత్రులు నో చెప్పినట్లుగా అనిల్ సూరి సోదరుడు రాజివ్ సూరి ఆరోపించారు.
గురువారం రాత్రి కన్నుమూసిన ఆయన్ను.. శుక్రవారం పరిమిత కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించినట్లుగా చెప్పారు. ఆయన అంత్యక్రియలు కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే నిర్వహించారు. కర్మయోగి.. రాజ్ తిలక్ లాంటి చిత్రాల్ని అనిల్ సూరి నిర్మించారు. ఆయనకు భార్య.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోజుల వ్యవధిలో బాలీవుడ్ కు చెందిన ఇరువురు మరణించటం కలకలం రేపుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates