మీరా వెర్స‌స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. మ‌ధ్య‌లోకి పూన‌మ్ కౌర్

బంగారం, వాన లాంటి సినిమాల్లో న‌టించిన ఉత్త‌రాది హీరోయిన్ మీరా చోప్రాకు, జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానుల‌కు మ‌ధ్య అనుకోకుండా త‌లెత్తిన వివాదం చాలా పెద్ద స్థాయికి వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే. తార‌క్ ఎవ‌రో తెలియ‌ద‌న్నందుకు త‌న‌ను బూతులు తిట్టిన అత‌డి అభిమానుల‌పై పోలీసులకు, జాతీయ మ‌హిళా క‌మిష‌న్ అధికారులకే కాక‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి, తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు కూడా ఫిర్యాదు చేసింది మీరా. దీనిపై పోలీసులు విచార‌ణ కూడా జ‌రుపుతున్నారు. ఇదిలా ఉండ‌గా.. ఈ వ్య‌వ‌హారంపై సినీ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన వ్య‌క్తులంతా మౌనం వ‌హిస్తున్నారు. మీరాకు మ‌ద్ద‌తుగా హీరోయిన్లు కూడా గ‌ళం విప్ప‌లేదు. ఐతే ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా పూన‌మ్ కౌర్ ఈ వివాదంపై మాట్లాడింది.

ట్విట్ట‌ర్లో ఎప్పుడూ ఎలా స్పందిస్తుందో అర్థం కాని పూన‌మ్.. మీరా, తార‌క్ ఫ్యాన్స్ గొడ‌వ విష‌యంలోనూ ఆశ్చ‌ర్య‌క‌ర రీతిలోనే స్పందించింది. ఆమె మీరా వైపేమీ నిల‌బ‌డ‌లేదు. ఫ్యాన్స్ గురించి పాజిటివ్‌గా మాట్లాడింది. అలా అని మీరాను తిట్టిపోయ‌డం క‌రెక్ట్ అన‌లేదు. ఫ్యాన్స్ అమాయ‌కుల‌ని.. ఇలాంటి వ్య‌వ‌హారాల్లో రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌తో కొంద‌రు ఫేక్ అకౌంట్లు సృష్టించి అవ‌త‌లి వాళ్ల మీద విషం చిమ్ముతార‌ని.. త‌ద్వారా హీరోల‌కు, అభిమానుల‌కు చెడ్డ పేరు తెచ్చేలా చూస్తార‌ని అంది పూన‌మ్. త‌న‌ను కూడా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌తో కొంద‌రు టార్గెట్ చేశార‌ని.. ఐతే తాను అభిమానుల జోలికి వెళ్ల‌కుండా ఇలాంటి కుట్ర‌ల‌కు కార‌ణ‌మైన‌ మ‌ధ్య‌వ‌ర్తుల మీదే పోలీసుల‌కు ఫిర్యాదు చేశాన‌ని అంది పూన‌మ్. మొత్తంగా చూస్తే మీరా వ్య‌వ‌హారంలో తార‌క్ ఫ్యాన్స్ త‌ప్పేమీ లేదు, కుట్ర పూరితంగా కొంద‌రు ఫేక్ అకౌంట్లు సృష్టించి మీరాను టార్గెట్ చేశారు అన్న‌ది పూన‌మ్ వాద‌న‌గా క‌నిపిస్తోంది.