‘నీలాంబరి’ పాట వచ్చేసింది

మెగాస్టార్ ‘ఆచార్య’ ప్లాన్స్‌ని సెకెండ్ వేవ్ పూర్తిగా మార్చి పారేసింది. షూటింగ్‌తో పాటు రిలీజ్‌ కూడా వాయిదా పడుతూ వచ్చింది. అప్పుడా ఇప్పుడా అనుకుంటూ ఎట్టకేలకి వచ్చే ఫిబ్రవరిలో విడుదల చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేశారు. నవంబర్‌‌ 5న రామ్ చరణ్, పూజా హెగ్డేల పాటని రిలీజ్ చేయబోతున్నామంటూ ఇటీవల ప్రకటించారు. ఇప్పుడు దీపావళి గిఫ్ట్‌గా ఆ పాట ప్రోమోని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

నీలాంబరీ నీలాంబరీ.. వేరెవ్వరే నీలా మరి’ అంటూ సాగే ఈ పాటకి రామ్‌ చరణ్ ఎంతో స్టైలిష్‌గా స్టెప్పులు వేస్తుంటే.. ట్రెడిషనల్‌ లుక్‌లో ఉన్న పూజా హెగ్డే అతన్ని చూసి చిరునవ్వులు చిందిస్తోంది. ఆల్రెడీ రిలీజైన ‘లాహే లాహే’ సాంగ్‌ని తీసిన లొకేషన్స్‌లోనే ఈ పాటను కూడా చిత్రీకరించినట్లు అర్థమవుతోంది. మణిశర్మ కంపోజ్ చేసిన ఈ పాటకి అనంత శ్రీరామ్ లిరిక్స్ రాశారు. అనురాగ్ కులకర్ణి, రమ్య బెహ్‌రా పాడారు. మిగతా పాటంతా ఎలా ఉంటుందో తెలియదు కానీ.. ప్రోమోలో ఉన్న టూ లైన్స్ వినగానే ఆమిర్‌‌ ఖాన్‌ ‘ఫనా’ సినిమాలోని ‘సుభానల్లా’ పాట గుర్తుకు రాక మానదు.

అదలా ఉంచితే.. ఈ చిత్రంలో రామ్ చరణ్ నక్సలైట్‌గా కనిపించబోతున్నాడని, అతని పాత్ర నిడివి కొంతే అయినా సినిమాకి ప్లస్ అవుతుందని, శాడ్ ఎండింగ్‌ కూడా ఉంటుందని.. ఇలా రకరకాల వార్తలు బైటికొచ్చిన సంగతి తెలిసిందే. వాటిని బట్టి ఉన్నంతసేపు అతని క్యారెక్టర్ చాలా సీరియస్‌గా సాగుతుందని, రెగ్యులర్ సినిమాల్లో ఉంటే కమర్షియల్ ఎలిమెంట్స్ అంతగా ఉండకపోవచ్చని అందరూ ఊహించారు. అయితే అందుకు భిన్నంగా లవ్, రొమాన్స్, డ్యాన్స్ లాంటివన్నీ ఉంటాయని ఈ పాట ద్వారా ప్రూవ్ అయ్యింది. ఇది ఫ్యాన్స్‌ని సంతోషపెట్టే విషయమే.