‘రామాయణం’తో రాఘవేంద్రరావు ప్లాన్!

పౌరాణిక చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు రాఘవేంద్రరావుకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ లాంటి పౌరాణిక గాథలను ఎంతో గొప్పగా చిత్రీకరించి ప్రేక్షకులకు అందించారు. ఇప్పుడు మరో పౌరాణిక చిత్రాన్ని రూపొందించాలనుకుంటున్నారు. ఆయన చివరిగా డైరెక్ట్ చేసిన సినిమా ‘ఓం నమో వెంకటేశాయ’. 2017లో విడుదలైన ఈ సినిమా తరువాత రాఘవేంద్రరావు మెగాఫోన్ పట్టుకోలేదు.

అయితే ఇప్పుడు నటుడిగా మాత్రం సినిమాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘పెళ్లి సందD’ సినిమాలో ఓ పాత్రలో కనిపించారు మన దర్శకేంద్రుడు.

ఇప్పుడు తణికెళ్లభరణి డైరెక్ట్ చేస్తోన్న ఓ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు డైరెక్టర్ గా ఓ సినిమా చేయాలని భావిస్తున్నారట రాఘవేంద్రరావు. ‘రామాయణం’ కథను సినిమాగా తీయాలనుకుంటున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ గాథను ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి.

భారీ హంగులతో.. స్టార్ నటీనటులతో ఈ కథను తెరకెక్కించబోతున్నారు. రాక్ లైన్ వెంకటేష్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇప్పటివరకు రామాయణం కథతో చాలా సినిమాలు వచ్చాయి. ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘ఆదిపురుష్’ కూడా రామాయణం కాన్సెప్ట్ తోనే తెరకెక్కిస్తున్నారు. అయితే రాఘవేంద్రరావు మాత్రం రామాయణాన్ని కొత్త పద్దతిలో ఆవిష్కరించబోతున్నారని సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివున్నాయి!