ఫ్యామిలీ హిస్ట‌రీనే పునీత్‌ను దెబ్బ కొట్టిందా?

క‌న్న‌డ హీరోల్లో ఫిట్నెస్ మీద బాగా ఫోక‌స్ ఉన్న హీరోల్లో ఒక‌డిగా పేరుంది పునీత్ రాజ్‌కుమార్‌కు. కెరీర్ ఆరంభం నుంచి అత‌ను ఎప్పుడూ ఫిట్‌గానే క‌నిపించాడు. ఎలాంటి స‌మ‌యంలోనూ పునీత్ ఫిట్‌నెస్‌ను నిర్ల‌క్ష్యం చేసిన‌ట్లు క‌నిపించేవాడు కాదు. లాక్ డౌన్ టైంలో కూడా యూట్యూబ్ ఛానెల్లో ఎన్నో ఫిట్నెస్ వీడియోలు షేర్ చేశాడు పునీత్. అలాంటివాడు ఇప్పుడు జిమ్‌లో వ‌ర్క‌వుట్లు చేస్తూనే గుండెపోటుకు గురై చ‌నిపోవ‌డం అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది.

త‌న శ‌క్తికి మించి బ‌రువులు ఎత్త‌డం వ‌ల్ల ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డి పునీత్ గుండెపోటుకు గురైన‌ట్లుగా చెబుతున్నారు. దీనిపై వైద్య నిపుణులు ఏమంటారో చూడాలి. ఈ సంగ‌త‌లా ఉంచితే.. పునీత్ ఫ్యామిలీ హిస్ట‌రీ అత‌డికి చేటు చేసిన‌ట్లు స్ప‌ష్ట‌మవుతోంది. పునీత్ కుటుంబంలో ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. ఇప్ప‌టికే ముగ్గురు గుండెపోటుకు గురి కావ‌డం గ‌మ‌నార్హం.

పునీత్ తండ్రి, లెజెండ‌రీ న‌టుడు రాజ్ కుమార్ 2006లో, 78 ఏళ్ల వ‌య‌సులో చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. అప్పుడాయ‌న గుండెపోటుతోనే మ‌ర‌ణించారు. ఆ వ‌య‌సులో గుండెపోటు రావ‌డం గురించి మ‌రీ ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు. కానీ పునీత్ అన్న‌లిద్ద‌రూ త‌క్కువ వ‌య‌సులోనే గుండెపోటుకు గురి కావ‌డం గ‌మ‌నార్హం.

పునీత్ రెండో అన్న రాఘ‌వేంద్ర రాజ్‌కుమార్‌కు 2013లోనే గుండెపోటు వ‌చ్చింది. అత‌డికి కూడా ఫిట్నెస్ ఫ్రీక్‌గా పేరుంది. కాక‌పోతే రాఘ‌వేంద్ర‌కు ప్రాణాపాయం త‌లెత్త‌లేదు. ఇంకో రెండేళ్ల‌కే, అంటే 2015లో పునీత్ పెద్ద‌న్న‌య్య‌, ప్ర‌ముఖ క‌థానాయ‌కుడు శివ‌రాజ్‌కుమార్‌కు మైల్డ్ హార్ట్ ఎటాక్ వ‌చ్చింది. ఇలా తండ్రి, ఇద్ద‌రు అన్న‌లు గుండెపోటుకు గురైన నేప‌థ్యంలో త‌న‌కూ ముప్పు పొంచి ఉంద‌ని పునీత్ జాగ్ర‌త్త ప‌డాల్సింది. అత‌డి జాగ్ర‌త్త‌గానే ఉండి ఉండొచ్చు కూడా. అయినా స‌రే ఈ రోజు హ‌ఠాత్ప‌రిణామం చోటు చేసుకుంది. కోట్ల‌మంది ఆరాధించే న‌టుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు.